Telugu Global
Andhra Pradesh

ఒంగోలు విషయంలో వైసీపీలో మథనం

ఎంపీ మాగుంట శ్రీనువాసుల రెడ్డి పైకి రఘురామ లాగా రెబెల్‌గా మారకపోయినా... టీడీపీ వైపు చూస్తున్నట్లు సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు.

ఒంగోలు విషయంలో వైసీపీలో మథనం
X

ఏపీలో అధికార వైసీపీలో ప్లీనరీ తర్వాత మరింత ఉత్సాహం పెరిగింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో పార్టీ పట్ల ప్రజలు ఎలాంటి వ్యతిరేకతతో ఉన్నారో అని కార్యకర్తలు, నాయకులు భయపడ్డారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ ప్లీనరీ తర్వాతి రోజు జరిగిన బహిరంగ సభ నిరూపించింది. పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మన‌థం పట్టడంతో నూతనోత్సహంతో పనిచేయడం ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలపై అధిష్టానం దృష్టి పెట్టింది.

సాధారణంగా అధికార పార్టీని విడిచి పెట్టి వెళ్లాలని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దగా అనుకోరు. ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉండి, అధికార పార్టీకి వైపు ప్రజల మద్దతు ఉన్న సమయంలో ఇతర పార్టీల వైపు చూపు కూడా చూడరు. కానీ వైసీపీకి మాత్రం రెండు చోట్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన రఘురామ కృష్ణం రాజు సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి ఒంగోలు ఎంపీ కూడా చేరినట్లు తెలుస్తుంది. ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీ మాగుంట శ్రీనువాసుల రెడ్డి పైకి రఘురామ లాగా రెబెల్‌గా మారకపోయినా... టీడీపీ వైపు చూస్తున్నట్లు సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు.

ఒంగోలు జిల్లాలో మాగుంట ఫ్యామిలీది తిరుగులేని అధికారం. మాగుంట శ్రీనివాసులు గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు మారారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో మాత్రం వైసీపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి మీద టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని కాదని మరీ మాగుంటను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చారు. మాగుంట కోసం వైవీ సుబ్బారెడ్డి సహా వైసీపీ క్యాడర్ అంతా గట్టిగా పని చేయడంతో రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కాగా, ఎంపీగా గెలిచిన తర్వాత మాగుంట వైసీపీ నేతలు, ఎంపీలతో కంటే.. తన పాత పార్టీ అయిన టీడీపీ ఎంపీలు, మిత్రులతోనే ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు. వాళ్లతో కలివిడిగా తిరగడం, పార్టీలు చేసుకోవడం వంటి విషయాలు అధిష్టానం దృష్టికి వచ్చాయి. అయితే పాత స్నేహితులతో కలవడాన్ని కాస్త తేలికగానే తీసుకున్నది. ఇటీవల ఒంగోలు వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. ఆ ఏర్పాట్లకు మాగుంట పరోక్షంగా సాయం చేశారని, తన అనుచరులతో స్వయంగా పని చేయించారనే వార్త అధిష్టానికి చేరింది. ఈ విషయంపై జగన్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.

తొలుత మాగుంటను పిలిచి జగన్‌తో మాట్లాడించాలని వైసీపీ పెద్దలు భావించారు. కాగా, రెండు పడవలపై కాళ్లు వేసి ప్రయాణించేవారితో మాట్లాడటం కంటే.. పక్కన పెట్టడమే మంచిదని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో మాగుంటతో చర్చలను కూడా అధిష్టానం పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఒక సీనియర్ రెడ్డి వర్గపు నాయకుడిని వైసీపీ పక్కన పెట్టిందనే విషయం ఇతర నాయకుల్లోకి వెళ్లకూడదని పార్టీ భావిస్తోంది. అందుకోసమే మాగుంట వ్యవహారాన్ని చాలా సున్నితంగా డీల్ చేస్తున్నట్లు సమాచారం.

మాగుంట వైసీపీలో ఉంటు టీడీపీకి ఎలా సహకరిస్తున్నారనే విషయాలు పూర్తిగా ఆ వర్గం నాయకులు, ప్రజలకు వివరించాలని క్యాడర్‌కు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అలా అతడి వ్యవహారాన్ని అందరూ తెలుసుకున్న తర్వాత పక్కన పెడితే పెద్దగా వ్యతిరేకత కూడా రాదని అధిష్టానం భావిస్తోంది. ఆ తర్వాతే మాగుంట ప్లేస్‌లో మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం అనుకుంటోంది.

First Published:  20 July 2022 7:50 AM GMT
Next Story