Telugu Global
Andhra Pradesh

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. అదే కారణమా..?

ఇటీవల జగన్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు ఆయన. దీంతో నరసరావుపేట టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. అదే కారణమా..?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేసినట్లు చెప్పారు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాజకీయంగా పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడిందన్నారు.

శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. గుంటూరు లేదా నరసరావుపేట లోక్‌సభ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశాన్ని శ్రీకృష్ణ దేవరాయలుకే చంద్రబాబు వదిలేశారని సమాచారం. శ్రీకృష్ణదేవరాయలు లోకేశ్‌తోనూ సమావేశమైనట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది.

నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పులో భాగంగా ఈసారి నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని ప్లాన్ చేసిన వైసీపీ హైకమాండ్‌.. కృష్ణదేవరాయలును గుంటూరుకు వెళ్లాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనకు శ్రీ‌కృష్ణదేవరాయలు విముఖత వ్యక్తం చేశారు. ఇటీవల జగన్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు ఆయన. దీంతో నరసరావుపేట టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.

ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపికి రాజీనామా చేశారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజీనామాలు కామన్ అంటున్నారు వైసీపీ నేతలు. ఎవరు రాజీనామాలు చేసినా పార్టీకి జరిగే నష్టం ఏం లేదని తేల్చి చెప్తున్నారు. టికెట్ కుదరదని చెప్పడంతోనే నేతలు పార్టీని వీడుతున్నారని స్పష్టంచేశారు.

First Published:  23 Jan 2024 12:34 PM IST
Next Story