Telugu Global
Andhra Pradesh

అవినాశ్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.. అరెస్టుకు రంగం సిద్ధం?

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు అవినాశ్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ అందించింది.

అవినాశ్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.. అరెస్టుకు రంగం సిద్ధం?
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సీబీఐ తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతి ఇచ్చింది. కాగా, విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐకి సీబీఐ ఆదేశాలు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి కోరినట్లు విచారణ ప్రాంతానికి మాత్రం న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు అవినాశ్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఫొటోలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. అవినాశ్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డు చేస్తున్నట్లు పేర్కొన్నది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు అందజేసింది. ఈ కేసులో సీఆర్పీసీ 160 ద్వారా విచారిస్తున్నామని.. కోర్టు ద్వారా విచారణకు రాలేదని సీబీఐ వెల్లడించింది.

హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని.. ఆయనపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయవద్దని హైకోర్టును సీబీఐ కోరింది. కాగా, వివేక హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను ఏ నేరంలో పాల్గొన్నట్లు.. ఎలాంటి ఆధారం లేదని అవినాశ్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు. కానీ.. హైకోర్టు మాత్రం అవినాశ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసి.. విచారణ కొనసాగించమని సీబీఐని ఆదేశించింది.

మరోవైపు ఈ కేసులో తమ వాదనలు వినాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీతరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని అవినాశ్ రెడ్డి న్యాయవాది వాదించారు. సునీత అభియోగాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. వివేక హత్య జరిగిన ఏడాది తరువాత ఆమె ఇలా ఆరోపణలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేక రెండో భార్య షమీంల పాత్రపై కూడా సీబీఐ విచారణ జరగడం లేదని తెలిపారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సీబీఐ దర్యాప్తు జరగాలని అవినాశ్ తరపు న్యాయవాది కోరారు.

కాగా, వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం మేరకు అవినాశ్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు గతంలోనే సీబీఐ హైకోర్టుకు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా అవినాశ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టేయడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లుగా భావించవచ్చు. సీబీఐ త్వరలోనే అవినాశ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

First Published:  17 March 2023 12:48 PM IST
Next Story