Telugu Global
Andhra Pradesh

దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేస్తున్న యువతికి.. వైఎస్ జగన్ రూ.10 లక్షల ఆర్థిక సాయం

యాత్రలో భాగంగా ఏపీకి చేరుకున్న ఆశా మాలవ్య సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా.. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేస్తున్న యువతికి.. వైఎస్ జగన్ రూ.10 లక్షల ఆర్థిక సాయం
X

మహిళా సాధికారత, భద్రత వంటి అంశాలను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒంటరిగా దేశమంతటా సైకిల్‌పై యాత్ర చేస్తున్న ఆశా మాలవ్య సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతరామ్‌కు చెందిన 24 ఏళ్ల ఆశా మాలవ్య ఓ పర్వతారోహకురాలు. మౌంటైనియరింగ్‌లో ఆశ ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అయితే మహిళలపై దేశంలో పెరుగుతున్న అరాచకాలు, వెనుకబాటుతనాన్ని చూసి చలించిపోయారు. ప్రజలందరికీ ఈ విషయంలో తప్పకుండా అవగాహన కలిగించాలనే లక్ష్యంతో గత ఏడాది నవంబర్ 1న ఆమె భోపాల్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు.

యాత్రలో భాగంగా ఏపీకి చేరుకున్న ఆశా మాలవ్య సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా.. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. అంతే కాకుండా ప్రభుత్వం తరపున రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె కాసేపు సీఎంతో ముచ్చటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను టచ్ చేస్తూ 25 వేల కిలోమీటర్లు తిరగాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8000 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర పూర్తయ్యిందని ఆమె సీఎం జగన్‌కు వివరించారు.

సీఎంను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను కలవడం ఎంతో గర్వంగా, ఉద్వేగంగా ఉందని పేర్కొన్నారు. మహిళల భద్రత, సాధికారత వంటి విషయాలపై జగన్ అభిప్రాయాలు చాలా గొప్పగా ఉన్నాయిని చెప్పారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలుసుకున్నానని, భద్రత కోసం దిశా యాప్ ప్రవేశపెట్టడం మంచి పరిణామమని ఆమె పొగిడారు. ఏపీలో మహిళలే కాకుండా అందరూ సురక్షితంగానే ఉన్నారని ఆమె అన్నారు.

తాను తలపెట్టిన సైకిల్‌ యాత్రమై భరోసా ఉంచుతూ రూ.10 లక్షలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జగన్ లాంటి సీఎం దేశానికే ఆదర్శంగా నిలుస్తారని ఆమె కొనియాడారు. ఇక ఆశా మాలవ్య గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను కూడా కలిశారు. యాత్రకు సంబంధించిన ఫొటోలు గవర్నర్‌కు చూపించి.. వాటి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆమెను సత్కరించి అభినందనలు తెలియ జేశారు.

సీఎం జగన్‌ను కలిసిన చెస్ క్రీడాకారిణి అలన మీనాక్షి

చదరంగం క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వైజాగ్ నగరానికి చెందిన 11 ఏళ్ల అలన మీనాక్షి ఫిడే రేటింగ్స్‌లో అండర్-12 విభాగంలో ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఇటీవలే ఆమె మహిళ ఫిడే మాస్టర్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నది. ఇటీవల కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2023కు ఎంపికైంది.

మీనాక్షిని సీఎం జగన్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రఖ్యాతులు నిలబెట్టేలా మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. అలనకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.



First Published:  6 Feb 2023 6:39 PM IST
Next Story