Telugu Global
Andhra Pradesh

సీఎం జగన్ లాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు : మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్

సీఎం జగన్ గురించి చెప్పాలంటే ఆయన ఒక హీరో.. ఇంత వరకు ఎక్కడా ఇలాంటి నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన మనిషిని చూడలేదని వుజిసిక్ అన్నారు.

సీఎం జగన్ లాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు : మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్
X

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న సీఎం జగన్ లాంటి వ్యక్తిని తాను పర్యటించిన ఏ దేశంలోనూ చూడలేదని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ అన్నారు. ఆయన ఒక అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ను వుజిసిక్ కలిశారు. జగన్‌ను కలవడం తాను ఒక గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఏపీలో ఉన్న దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారని తాను గుర్తించానన్నారు. ఈ రంగంలో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తున్నది. ఇది ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు. నా జీవిత కథను విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్పూర్తిదాయకమైన వ్యక్తుల కింద 'ఆటిట్యూడ్ ఈజ్ఆల్టిట్యూడ్' పేరుతో పదో తరగతి ఇంగ్లీషులో పాఠ్యాంశంగా పెట్టడం చాలా ఆనందం కలిగించే విషయమని వుజిసిక్ అన్నారు. ఈ పాఠంలో నా గురించి, నా భార్య గురించి రాశారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.

ఇక్కడి విద్యార్థులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వీళ్లకు ఇచ్చిన యూనిఫామ్స్, ట్యాబ్స్ చాలా బాగున్నాయి. మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇవన్నీ తాను ఆశించిన సదుపాయాలే అని చెప్పారు. విద్యారంగంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించే దిశగా.. మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో నేను పని చేస్తున్నాను. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏపీలో ఉన్నాయని కొనియాడారు. ఈ సీఎం గురించి చెప్పాలంటే ఆయన ఒక హీరో.. ఇంత వరకు ఎక్కడా ఇలాంటి నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన మనిషిని చూడలేదని అన్నారు.

కాగా, నికోలస్ జేమ్స్ వుజిసిక్ ప్రపంచానికి నిక్ వుజిసిక్‌గా పరిచయం. పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నారు. అంతే కాకుండా సముద్రంపై సర్ఫింగ్ కూడా చేస్తారు. చిన్నప్పుడు తల్లి చేతుల్లో మామూలుగానే పెరిగినా.. ఎదుగుతున్న కొద్దీ అతడికి కష్టాలు తెలిసి వచ్చాయి. దీంతో నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నారు. అలాగే గొంతు కింద గోల్ఫ్ స్టిక్ పెట్టి ఆడటం నేర్చుకున్నారు. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై తన ప్రసంగాలతో స్పూర్తిని నింపారు.



First Published:  1 Feb 2023 7:29 PM IST
Next Story