Telugu Global
Andhra Pradesh

పవన్ మాటలతో మరింత కన్ఫ్యూజన్

పవన్ కల్యాణ్, చంద్రబాబు దూతగా ఢిల్లీ వెళ్లారా అనిపిస్తోంది. బీజేపీతో పొత్తుకోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు, ఆ విషయంలో పవన్ ని చొరవ తీసుకోమన్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి.

పవన్ మాటలతో మరింత కన్ఫ్యూజన్
X

పవన్ కల్యాణ్ సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకోవడం, రెండురోజులపాటు బీజేపీ పెద్దలను కలవడంతో ఏపీ రాజకీయాల్లో ఏదో కీలక పరిణామం జరగబోతోందని అనుకున్నారంతా. కానీ అలాంటిదేమీ లేదు. కనీసం బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని కూడా పవన్ చెప్పలేదు. ఢిల్లీ టూర్ తర్వాత ఆయన మరింత తికమకగా మాట్లాడారు. ఏపీకి మంచిరోజులొస్తాయని మాత్రమే చెప్పారు.

పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..?

ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం.. కొన్నాళ్లుగా పవన్ ఇదే మాట చెబుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇదే చెప్పారు. కొత్తగా ఒక్క పదం కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఏపీలో ప్రభుత్వ అరాచకాలు పెరిగిపోయాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని అన్నారు పవన్. అదే సమయంలో ఏపీలో బీజేపీ, జనసేన విడివిడిగా బలపడాలి కదా అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన అజెండా అని, అదే అజెండాతో బీజేపీ కూడా పనిచేస్తోందన్నారు.


బాబు దూతగా..?

పవన్ కల్యాణ్, చంద్రబాబు దూతగా ఢిల్లీ వెళ్లారా అనిపిస్తోంది. బీజేపీతో పొత్తుకోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు, ఆ విషయంలో పవన్ ని చొరవ తీసుకోమన్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే పదే పదే వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటున్న పవన్, బీజేపీ పొత్తుపై మాత్రం తేల్చి చెప్పడంలేదు. మీడియా అనుకున్న సమయంలో కాదు, మేము అనుకున్న సమయంలోనే పొత్తులపై క్లారిటీ ఇస్తామని మాత్రం చెప్పారు పవన్.

మరిన్ని అనుమానాలు..

వైసీపీ ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీ, జనసేన మధ్య చీలిక స్పష్టమైంది. అయితే పవన్ పర్యటనతో అది కాస్తా ప్యాచప్ అవుతుందనుకున్నారంతా. కానీ పవన్ ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. పొత్తులో ఉన్నాయనుకుంటున్న రెండు పార్టీలు కనీసం వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేస్తాం అని చెప్పకపోవడమేంటి..? పవన్ మీటింగ్ ల తర్వాత కనీసం బీజేపీ నుంచి స్పందన లేకపోవడమేంటి..? ఇవన్నీ ఇప్పుడు ఏపీ జనసైనికుల్లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

First Published:  5 April 2023 6:39 AM IST
Next Story