జగన్ పై మోపిదేవి సంచలన ఆరోపణలు
జగన్ ఒంటెత్తు పోకడలు రాజకీయాలకు పనికి రావన్నారు మోపిదేవి వెంకట రమణ. సంక్షేమంపైనే దృష్టిపెట్టి, అభివృద్ధిని పట్టించుకోకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణం అని చెప్పారు.
ఈరోజు వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.. ఇద్దరూ వైసీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. వారిద్దరూ టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో పాత పార్టీపై, ఆ పార్టీ అధినేత జగన్ పై మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తో జర్నీ కష్టం అని ఆయన తేల్చి చెప్పారు.
గతంలో తనకు జగన్ ఎంపీ పదవి ఇచ్చినా, అందులో తాను ఇమడలేకపోయానన్నారు మోపిదేవి వెంకట రమణ. తాను రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టానని, అందుకే టీడీపీలో చేరబోతున్నానని చెప్పారు. జగన్ ఒంటెత్తు పోకడలు రాజకీయాలకు పనికి రావన్నారు. సంక్షేమంపైనే దృష్టిపెట్టి, అభివృద్ధిని పట్టించుకోకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణం అని చెప్పారు. గత ఎన్నికల సమయంలో తనకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందానన్నారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని, ఇప్పుడు అందర్నీ సంప్రదించి టీడీపీలోకి వెళ్తున్నట్టు చెప్పారు మోపిదేవి. వైసీపీ ఓడిపోవడం వల్లే తాను పార్టీ మారుతున్నాననడం సరికాదన్నారు.
బీదా మస్తాన్ రావు మాత్రం తనది వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారు. టీడీపీలో చేరే విషయంపై మోపిదేవి క్లారిటీ ఇచ్చినా, బీదా మాత్రం తాను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. వైసీపీ ఓటమిని ఆయన తక్కువచేసి చూపలేదు. గెలుపు ఓటములు సహజం అని, గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వైసీపీకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఇద్దరు ఎంపీలు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.