విశాఖలో మంకీపాక్స్ అనుమానితుడు పరారీ.. కారణం అదేనా..?
22 ఏళ్ల ఆ యువకుడు ఇటీవలే హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చాడు. అతడిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలను గుర్తించి వెంటనే గీతం ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.
మళ్లీ కరోనా రోజులు గుర్తొచ్చాయి, గతంలో కరోనా పాజిటివ్ వచ్చినవారిలో కొంతమంది చికిత్సకు రాకుండా మొండికేసేవారు. అంబులెన్స్ లలో ఎక్కించబోతే పరుగులు తీసేవారు. ఇప్పుడు విశాఖ పట్నంలో మంకీపాక్స్ అనుమానితుడు కూడా అలాగే పారిపోయాడు. అడ్రస్ లేకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో అతనికోసం అధికారులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంతకీ ఆ యువకుడు ఎందుకు పారిపోయాడు..?
కరోనా వచ్చిందంటే దానికో లెక్కుంది. కరోనా బాధితులకు సన్నిహితంగా ఉండటం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కరోనా అటాక్ అయిందని చెప్పొచ్చు. మంకీపాక్స్ వచ్చిందంటే చుట్టుపక్కల జనాలు ఎయిడ్స్ వచ్చినట్టు భయపడుతున్నారు. కేవలం శృంగార చర్యల వల్లే మంకీపాక్స్ వస్తుందనే అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. దీంతో ఇదెక్కడి గొడవ అనుకుంటూ ఆ యువకుడు చికిత్సకు నిరాకరిస్తూ పారిపోయాడు. కేవలం అనుమానం ఉంది, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపిస్తారు, అప్పటి వరకూ జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచి వైద్యం అందిస్తారు. అయినా కూడా ఆ యువకుడు భయంతో పారిపోయాడు. ఇంత చేసిన ఆ యువకుడు మెడికల్ స్టూడెంట్ కావడం మరీ విచిత్రం.
భారత్ లో ఇప్పటి వరకు 9 మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి, వందల సంఖ్యలో అనుమానిత కేసులు వచ్చినా ఏదీ నిర్థారణ కాలేదు. ఏపీలో ఇటీవల గుంటూరులో ఓ బాలుడికి మంకీపాక్స్ లక్షణాలున్నాయని ఆస్పత్రిలో చేర్చారు, అతడికి వైరస్ ఇంకా నిర్థారణ కాలేదు. తాజాగా విశాఖలో గీతం యూనివర్సిటీకి చెందిన ఓ మెడికోకు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. 22 ఏళ్ల ఆ యువకుడు ఇటీవలే హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చాడు. అతడిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలను గుర్తించి వెంటనే గీతం ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. ఆ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి నలుగురు వైద్యుల బృందం ఆ యువకుడిని పరీక్షించడానికి వెళ్లగా.. అతను పరారయ్యాడు. దీంతో అధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఆ మెడికో ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.