Telugu Global
Andhra Pradesh

టీడీపీలో కొత్త పంచాయితీ..?

ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్పష్టంగా చెప్పేశారట. పోటీచేయాలని అనుకుంటున్న వాళ్ళు 35 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందే అని కచ్చితంగా చెబుతున్నారట.

టీడీపీలో కొత్త పంచాయితీ..?
X

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో కొత్త పంచాయితీ మొదలైందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆర్థికస్తోమత ఉన్నవాళ్ళకే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆశావహులకు డైరెక్టుగానే చెప్పేస్తున్నారట. అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థులను ఢీకొనాలంటే టీడీపీ తరఫున కూడా బాగా డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వక తప్పటంలేదని సీనియర్లకు చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారట.

ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్పష్టంగా చెప్పేశారట. పోటీచేయాలని అనుకుంటున్న వాళ్ళు 35 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందే అని కచ్చితంగా చెబుతున్నారట. గద్దె, దేవినేనికి ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పినట్లు టాక్ వినబడుతోంది. దాంతో పోటీ విషయంలో ఇద్దరు అయోమయంలో పడ్డారట. ఎన్నికల్లో డబ్బులు ఏదోరూపంలో ఖర్చులు పెట్టుకుంటాము కానీ, అంత డబ్బు ముందుగానే డిపాజిట్ చేయాలంటే కష్టమే అని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారట.

ఇదే విధమైన పద్ధ‌తి ఒకప్పుడు ప్రజారాజ్యంపార్టీలో ఉండేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేయాలని అనుకున్న నేతల ఆస్తులు, ఆర్థిక స్తోమతను చూపించాలనే షరతు విధించినట్లు అప్పట్లో చాలా ఆరోపణలొచ్చాయి. ఆస్తులు, ఆర్థిక స్తోమతను ఎవరు ఎక్కువగా చూపిస్తే వాళ్ళకే టికెట్లు అన్నట్లుగా వేలంపాటల ద్వారా టికెట్లను ఫైనల్ చేశారని విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ఇంతకాలానికి మళ్ళీ చంద్రబాబు కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు డబ్బులు ఖర్చవుతాయని అందరికీ తెలిసిందే.

అయితే ముందుగా చెప్పినంతగా డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళకే టికెట్ అంటే చాలామంది ఇబ్బంది పడటం ఖాయం. గుడివాడలో వెనిగండ్ల రాము, గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావుకు చంద్రబాబు టికెట్లను ఈ పద్దతిలోనే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఇబ్బందులు పడక తప్పదని అర్థ‌మవుతోంది. టికెట్ కోసమని ముందు ఏదో పద్దతిలో డిపాజిట్లు చూపించినా మధ్యలోనే అభ్యర్థులు చేతులెత్తేస్తే అప్పుడు చంద్రబాబు ఏమి చేస్తారు..?

First Published:  23 Dec 2023 9:39 AM IST
Next Story