మోడీ కి విశాఖలో 'ఉక్కు సెగ' తప్పదా..?
శుక్రవారంనాడు జరిగిన గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జివిఎంసి) సమావేశంలో బిజెపిని ప్రతిపక్ష సభ్యులు విమర్శించడంతో సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎందుకు మాట్లాడరని సభ్యులు ప్రశ్నించారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయొద్దని దాదాపు 600 రోజులకు పైగా కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నా బిజెపి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ విషయాలను ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడే తేల్చుకుంటామని హెచ్చరించారు.
విశాఖ పట్టణంలో రైల్వే జోన్ పనులు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నెల 11వ తేదీన రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్థానికుల నుంచి నిరసన తప్పేలా లేదు. ఇప్పటికీ రైల్వే జోన్ పై కొనసాగుతున్న సందేహాలు, మరో వైపు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై మొండిచెయ్యి చూపడం, మూడు రాజధానులపై స్పష్టత ఇవ్వకపోవడం వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
తాజాగా శుక్రవారంనాడు జరిగిన గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జివిఎంసి) సమావేశంలో బిజెపిని ప్రతిపక్ష సభ్యులు విమర్శించడంతో సమావేశం రసాభాసగా మారింది. బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయొద్దని దాదాపు 600 రోజులకు పైగా కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నా బిజెపి పట్టించుకోలేదని విమర్శించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైసీపి పాలనలో జరుగుతున్న వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అక్రమాలపై నోరెత్తుతున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఇటువంటి విషయాలను బిజెపి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడే తేల్చుకుంటామని హెచ్చరించారు.