ఏపీలో నాలుగుచోట్ల మోడీ సభలు.. కూటమి నేతల్లో టెన్షన్
ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి పాల్గొంటున్న సభలకు జనం నుంచి పెద్దగా స్పందన ఉండట్లేదు. పైగా చిలకలూరిపేట సభలో జనం లేకపోవడంతో మోడీ ముందు పరువు పోయింది.
టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ రానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఆయన రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొంటారు. సభా స్థలాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రాథమికంగా అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప/ రాజంపేట, మరోచోట సభలు ఉంటాయని టీడీపీ చెబుతోంది. వేదికలు ఖరారయ్యాక బీజేపీ పెద్దలతో సంప్రదించి తేదీలు ఖరారు చేస్తారు. మోడీ సభలు ఏమో గానీ, కూటమి నేతల్లో టెన్షన్ మొదలయింది. చిలకలూరిపేటలో గత నెలలో పెట్టిన సభ అట్టర్‌ఫ్లాప్ అవడమే దీనికి కారణం.
మోడీ ముందు పరువుపోతోందిగా..
ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి పాల్గొంటున్న సభలకు జనం నుంచి పెద్దగా స్పందన ఉండట్లేదు. పైగా చిలకలూరిపేట సభలో జనం లేకపోవడంతో మోడీ ముందు పరువు పోయింది. ఈ పరిస్థితుల్లో నాలుగు సభలకు, అదీ మండుటెండల్లో జనాన్ని తరలించడం తలకు మించిన భారమేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంగారుపడుతున్నారు. కానీ, మోడీ సభలన్నా పెట్టకపోతే జనం తమ పొత్తుకు మోడీ ఆశీర్వాదం లేదని అనుమానిస్తారేమోనని మరోవైపు ఆందోళన చెందుతున్నారు. అలాగని సభలు పెట్టించాక జనం రాకపోతే మోడీ ముందు మరోసారి పరువు పోతుందని బాబు, పవన్ టెన్షన్ పడుతున్నారు.
కలిసిరాని శ్రేణులతో కలవరం
మరోవైపు కూటమిలో ఒక పార్టీ పోటీ చేసేచోట మిగిలిన రెండు పార్టీల అభ్యర్థులూ పూర్తిస్థాయిలో ప్రచారానికి రావట్లేదు. వాళ్లు పిలిస్తే వెళతామన్నట్లు వ్యవహరిస్తున్నారు. పిలిచినా పేరంటానికి వెళ్లినట్లు వెళ్లి రావడమే తప్ప మన కూటమి విజయం సాధించాలనే కసి అక్కడ పోటీ చేయని రెండు పార్టీల కార్యకర్తల్లో కనిపించట్లేదన్నది ఎన్డీఏ అభ్యర్థుల ఆవేదన. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ లాంటి వ్యక్తి సభలకు మూడు పార్టీల కార్యకర్తలనూ ఎలా లాక్కురావాలని బాబు, పవన్, పురందేశ్వరి మల్లగుల్లాలు పడిపోతున్నారు.