బాబు అవినీతి చేయలేదని ప్రమాణం చేస్తారా? - భువనేశ్వరికి ఎమ్మెల్సీ తలశిల రఘురాం సవాల్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రాథమిక ఆధారాలు ఉండటం వల్లే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని రఘురాం చెప్పారు. నిజం గెలవాలంటే తమ ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా అని చాలెంజ్ చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడు రిమాండ్‌పై సెంట్రల్ జైలులో ఉంటే.. ఆయన బయటికి రావాలని, నిజం గెలవాలంటూ యాత్ర చేస్తామంటున్న ఆయన సతీమణి భువనేశ్వరి.. తన భర్త చంద్రబాబు అవినీతి చేయలేదని ప్రమాణం చేస్తారా అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం సవాల్ విసిరారు. నారా భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేసి యాత్ర ప్రారంభించాలన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రాథమిక ఆధారాలు ఉండటం వల్లే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. నిజం గెలవాలంటే తమ ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా అని చాలెంజ్ చేశారు రఘురాం.
లోకేష్ ఏ యాత్ర చేపట్టినా.. మధ్యలోనే ఆగిపోతుంది..
భవిష్యత్ లేని లోకేష్.. భవిష్యత్‌కి గ్యారంటీ యాత్ర చేస్తే ఏం లాభమని తలశిల రఘురాం ఈ సందర్భంగా ప్రశ్నించారు. నారా లోకేష్ ఏ యాత్ర చేపట్టినా మధ్యలో ఆగిపోతుందన్న ఆయన.. యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేష్ దానిని మధ్యలోనే ఆపేస్తాడని తాను ఎప్పుడో చెప్పానన్నారు. ఒక చోట ఓడిన లోకేష్.. రెండు చోట్ల ఓడిన పవన్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు పేరుతో ఆదివారం విడుదల చేసిన లేఖపై సమగ్రమైన విచారణ జరగాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తాడని, ఈ విషయం రిటైర్డ్ జడ్జిలే చెప్పారని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముతారని.. చంద్రబాబు తరహాలో వ్యవస్థలను మేనేజ్ చేసే నైజం జగన్‌ది కాదని ఆయన చెప్పారు.
లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాని ఎందుకు కలిశారో చెప్పాలని ఈ సందర్భంగా తలశిల రఘురాం డిమాండ్ చేశారు. చంద్రబాబు తన ఆస్తులపైన, కేసుల పైన సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.
అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర
వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత చాటి చెప్పేలా ఉంటుందని ఎమ్మెల్సీ తలశిల రఘురాం స్పష్టం చేశారు. యాత్ర అన్ని నియోజకవర్గాల్లో సాగుతుందన్న తలశిల.. ఈ నెల 26న ఇచ్చాపురం, తెనాలి, సింగనమలలో ప్రారంభమవుతుందని చెప్పారు.
♦