ఎమ్మెల్సీ ఎన్నికలు:బీజేపీకి ఆందోళన కలిగిస్తున్న జనసేన వైఖరి
జనసేన వ్యవహారం పై లోలోపల రగులుతున్న బీజేపీ నేతలు పైకి మాత్రం మేమిద్దరమూ దోస్తులమే అని పదే పదే ప్రకటిస్తారు. మళ్ళీ ఇప్పుడు ఓ పరీక్ష వచ్చింది. ఏపీలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దించింది.
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందా ? అంటే ఉంది అంటారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..... పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడరు...ఈ రెండు పార్టీలు కలిసి ఎప్పుడైనా ఎక్కడైనా పోటీ చేశాయా ? అంటే తాము పోటీ చేసిన చోట జనసేన మద్దతు ఇస్తుంది అంటారు సోము వీర్రాజు...కానీ గ్రౌండ్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో కూడా జనసేన సైలెంట్ గా ఉండిపోయింది.
జనసేన వ్యవహారం పై లోలోపల రగులుతున్న బీజేపీ నేతలు పైకి మాత్రం మేమిద్దరమూ దోస్తులమే అని పదే పదే ప్రకటిస్తారు. మళ్ళీ ఇప్పుడు ఓ పరీక్ష వచ్చింది. ఏపీలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దించింది.
ఆ ముగ్గురు అభ్యర్థులు గెలవాలన్నా, కనీసం వైసీపీ, టీడీపీలకు పోటీ ఇవ్వాలన్నా జనసేన మద్దతు అవసరం. జనసేన మద్దతు కోసం సోమువీర్రాజు తెగప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ముగ్గురిని గెలిపించి తన సత్తా చాటాలని వీర్రాజు తహతహలాడుతున్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా జనసేన అగ్రనేతలను , స్థానిక నేతలను బీజేపీ నాయకులు అభ్యర్థిస్తున్నారు. అయితే నిన్నటి దాకా అటునుండి చడీ చప్పుడు లేదు. సడెన్ గా నిన్న ఆ పార్టీ లో నెంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేసి బీజేపీ నాయకుల ఆశలను నీరు గార్చారు.
జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ అభ్యర్థులను ఓడించేందుకు కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అయితే ఎవరికి ఓటు వేయాలో ఆయన చెప్పలేదు. దాంతో సోము వీర్రాజు గుండెల్లో బండపడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమకు జనసేన ఓట్లు కూడా పడకపోతే డిపాజిట్లు రావడం కూడా కష్టమే అని ఆందోళన చెందుతున్నారట.
ఎలాగైనా ఏపీలో తాము కూడా ఉన్నామని చెప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి నాదెండ్ల ప్రకటన మింగుడుపడటం లేదు. జనసేన్ ఛీఫ్ పవన్ కళ్యాణ్ తోనే మాట్లాడాలని వారు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదట.
కాగా, కొంత కాలంగా పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గరవుతున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు పార్టీల పొత్తుకు బీజేపీ కూడా ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. బీజేపీ మాత్రం చంద్రబాబును దగ్గరికి రానివ్వద్దని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పేరుకే బీజేపీ, జనసేన పొత్తు ఉంది తప్ప జనసేన కార్యక్రమాలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.