ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదా..?
ఏడాదిన్నరలో మండలిలో పూర్తి మెజార్టీ వస్తుందని తెలిసినా, దాన్ని రద్దు చేసేందుకే జగన్ నిర్ణయించారని, అది రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయం అంటూ అప్పట్లో సాక్షి కథనాలనిచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ, సీఎం జగన్ పై సోషల్ మీడియాలో టీడీపీ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. ఆనాడు శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి ఎత్తు చూపుతున్నారు టీడీపీ నేతలు. తన నిర్ణయానికి మండలి అడ్డు చెప్పిందని, ఏకంగా మండలినే రద్దు చేస్తానన్న సీఎం, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ మండిపడ్డారు. దీనికి సాక్ష్యంగా గతంలో సాక్షి ప్రసారం చేసిన కథనాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.
ఏడాదిన్నరలో మండలిలో పూర్తి మెజార్టీ వస్తుందని తెలిసినా, దాన్ని రద్దు చేసేందుకే జగన్ నిర్ణయించారని, అది రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయం అంటూ అప్పట్లో సాక్షి కథనాలనిచ్చింది. గతంలో మేథావులంతా మండలి రద్దుకే మొగ్గు చూపారని, వారి బాటలోనే జగన్ కూడా మండలిని రద్దు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, రాజకీయ నేతల పునరావాస కేంద్రం టీడీపీకి ఎంత అవసరమో, వైసీపీకి కూడా అంతే అవసరం. ఆ మాటకొస్తే ఏ పార్టీకయినా ఇలాంటి వ్యవస్థలు తప్పనిసరి. అందుకే మండలి రద్దు విషయంలో సైలెంట్ గానే ఉన్నారు జగన్. అప్పట్లో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని, ఆ తర్వాత ఆలోచించి పక్కనపెట్టేశారు. రాజకీయ అవసరాల మేరకు నాయకుల్ని మండలికి పంపుతున్నారు.
తాజాగా ఎమ్మెల్యేల కోటా, స్థానిక కోటా, గవర్నర్ కోటాలే కాకుండా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్షంలో ఉండగా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతిచ్చిన వైసీపీ, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలే విజయాన్నిస్తాయనే ధీమాతో అభ్యర్థులను నిలబెట్టింది. సచివాలయ ఉద్యోగులు, డిగ్రీ చదివిన వాలంటీర్ల ఓట్లు గుంపగుత్తగా తమకే పడతాయనే ధీమా కూడా ఆ పార్టీలో ఉంది. అందుకే జగన్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల్ని పోటీకి దింపారు. మండలినే రద్దు చేస్తామన్న జగన్, ఇప్పుడు అభ్యర్థుల్ని ఎలా నిలబెడతారంటూ మండిపడ్డారు చంద్రబాబు. మండలి వ్యవస్థను అగౌరవ పరిచిన సీఎం, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
రెఫరెండం అనొచ్చా..?
ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టినా వైసీపీకి గెలుపుపై ఆ స్థాయిలో ధీమా లేదు. ఎందుకంటే ఉపాధ్యాయ వర్గాల్లో ఆల్రడీ తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది. ఇటు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా వారిదే మెజారిటీ ఓటు ఉంటుంది. సీపీఎస్ రద్దు లేకపోవడం, పీఆర్సీ ఆశించిన స్థాయిల లేకపోవడం, ఆన్ లైన్ హాజరు అంటూ నిబంధనలు కఠినం చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఈ ఎన్నికల్లో తమ అసంతృప్తిని బయటపెట్టే అవకాశాలున్నాయి. అంటే.. టీడీపీ అభ్యర్థి గెలవకపోయినా పర్లేదు, వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటూ టీడీపీ ప్రచారం చేసుకోడానికి మంచి అవకాశం దొరికినట్టే. దానికోసమే చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. తన అభ్యర్థుల విజయం కంటే, వైసీపీ అభ్యర్థుల పరాజయం కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారు.