మహిళా సాధికారత అంటే ఇదే..! ఎమ్మెల్సీ భార్యకు ఎమ్మెల్యే సీటు
ఎమ్మెల్సీ పదవి ఆ కుటుంబానికే, ఎమ్మెల్యే టికెట్ కూడా ఆ కుటుంబానికే రావడం గమనార్హం. అయితే భార్యకోసం భర్త చేసిన త్యాగానికి మహిళా సాధికారత అనే పెద్ద పదం వాడటం మాత్రం విశేషం.
మహిళా సాధికారత గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు ఓ ఎమ్మెల్సీ. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తానని సీఎం జగన్ మాటిచ్చినా తాను మాత్రం వద్దన్నానని చెప్పారు. ఆ సీటు తనకంటే ఓ మహిళకు ఇస్తే బాగుంటుందని సూచించానన్నారు. ఈరోజుల్లో కూడా ఇంత త్యాగమూర్తి ఎవరై ఉంటారనుకుంటున్నారా..? ఆయన పేరు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీ. ఆయన సీటు త్యాగం చేసింది ఇంకెవరో మహిళా నేతకు కాదు, తన భార్యకే. అవును ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన భార్యకు ఎమ్మెల్యే సీటు కావాలన్నారు, అదేమంటే మహిళా సాధికారత, మహిళలకు పట్టం, ఆడవారికి అందలం అంటూ ఉపన్యాసమిచ్చారు. చివర్లో ఆ సీటు తన భార్యకేనంటూ ట్విస్ట్ ఇచ్చారు.
టెక్కలికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే. 2019లో అక్కడ వైసీపీ తరపున పేరాడ తిలక్ పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2014లో వైసీపీ తరపున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. 2009లో దువ్వాడ పీఆర్బీ అభ్యర్థి కావడం విశేషం. గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన దువ్వాడకు ఆ తర్వాత జగన్ సముచిత గౌరవం ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన్ను నియోజకవర్గ ఇన్ చార్జ్ ని చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే అసెంబ్లీ టికెట్ అని ప్రకటించారు కూడా.
కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ పై స్వయానా ఆయన భార్య వాణి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కుటుంబంలో కలతలు, స్థానిక నేతలతో ఆయనకు సమన్వయ లేమి అనే అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇటీవల ఆయన చేసిన కొన్ని ఘనకార్యాలు కూడా బయటపడ్డాయి. దీంతో సీఎం జగన్ స్వయంగా అభ్యర్థిని మార్చారని అంటున్నారు. అయితే దువ్వాడ మాత్రం తనకు తానే తన భార్య పేరు ప్రతిపాదించినట్టు, జగన్ ని ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ పదవి ఆ కుటుంబానికే, ఎమ్మెల్యే టికెట్ కూడా ఆ కుటుంబానికే రావడం గమనార్హం. అయితే భార్యకోసం భర్త చేసిన త్యాగానికి మహిళా సాధికారత అనే పెద్ద పదం వాడటం మాత్రం విశేషం.