ఏపీ దేవాదాయశాఖ మంత్రి కినుక
స్థానిక ఎమ్మెల్యేలైన తమకు పూర్తి అవగాహన ఉందని, తమ నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టిన్నట్టు తెలుస్తోంది. దాంతో మంత్రి సూచనలు అమలు కాలేదు.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నొచ్చుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో మంత్రి మాటను స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గురువారం మోడల్ గెస్ట్ హౌజ్‌లో మంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అధికారులు అక్కడికి వెళ్లలేదు.
ఆ తర్వాత మంత్రినే కలెక్టర్ గెస్ట్ హౌజ్‌కు పిలిపించారు. అక్కడ జరిగిన అంతర్గత సమావేశంలో మంత్రి చేసిన పలు సూచనలను స్థానిక ఎమ్మెల్యేలైన మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తోసిపుచ్చిన్నట్టు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలైన తమకు పూర్తి అవగాహన ఉందని, తమ నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టిన్నట్టు తెలుస్తోంది. దాంతో మంత్రి సూచనలు అమలు కాలేదు.
అంతర్గత సమావేశం తర్వాత వివిధ శాఖల అధికారులతో ఉత్సవాలపై సమావేశం ఉండగా దానికి హాజరయ్యేందుకు తొలుత మంత్రి కొట్టు ఆసక్తి చూపలేదు. తన దారిలో తాను వెళ్లిపోతుండగా హోంమంత్రి తానేటి వనిత నచ్చజెప్పి ఆయన్ను సమావేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటన ఉన్నప్పటికీ.. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం వెళ్లలేదు.