గన్నవరం, గుడివాడను టచ్ చేసే దమ్ముందా? - చంద్రబాబుకు కొడాలి నాని, వంశీ సవాల్
చంద్రబాబు చేసిన విమర్శలపై గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని తీవ్రంగా స్పందించారు.
ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్ర రాజకీయం రచ్చకెక్కుతోంది. ప్రత్యర్థులపై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు.
మాటల తూటాలు పేల్చుతున్నారు. శుక్రవారం చంద్రబాబు చేసిన విమర్శలపై గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ చంద్రబాబుకు సవాళ్లు విసిరారు.
ముందు నీ స్థానంలో గెలవగలనా లేదా అనేది చూసుకో అని ఎద్దేవా చేశారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానాలన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి వచ్చేశాయని, ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు సీటును పదిలం చేసుకోవాలని వంశీ సూచించారు.
కుప్పంలో ఇప్పటికే ఆయన కుర్చీ కదిలిపోయిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆ తర్వాత వేరేవారిని ఓడించడంపై ఆలోచించవచ్చని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
టచ్ చేసి చూడండి.. ఎవరిని టచ్ చేస్తారు.. అంటూ కొడాలి నాని మండిపడ్డారు. నేనొస్తే వదిలిపెట్టను అంటూ చంద్రబాబు శుక్రవారం నాటి కార్యక్రమంలో హెచ్చరించడంపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని టచ్ చేస్తావ్.. వంశీని చేస్తావా.. నన్ను టచ్ చేస్తావా.. అంబటి రాంబాబును టచ్ చేస్తావా అంటూ మండిపడ్డారు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.