Telugu Global
Andhra Pradesh

నాకేం జరిగినా సజ్జలదే బాధ్యత : ఎమ్మెల్లే ఉండవల్లి శ్రీదేవి

నా ప్రాణానికి ఎలాంటి హానీ జరగదు అని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తేనే తాను తిరిగి ఏపీలో అడుగు పెడతానని శ్రీదేవి అన్నారు. సజ్జల కారణంగానే తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.

నాకేం జరిగినా సజ్జలదే బాధ్యత : ఎమ్మెల్లే ఉండవల్లి శ్రీదేవి
X

తనకు ఏం జరిగినా దానికి బాధ్యత ప్రభుత్వ సలహాదారు, పార్టీ నాయకులు సజ్జల రామకృష్టారెడ్డే అని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి భిన్నంగా టీడీపీ అభ్యర్థికి ఓటేశారనే ఆరోపణల కారణంగా ఆమెను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమె ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆ కోపంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తాజాగా.. ఆమె హైదరాబాద్‌లో భర్త డాక్టర్ శ్రీధర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

నేను మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నానని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ గూండాలు నన్ను వేధిస్తున్నారు. టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అందుకే బయటకు రాలేదు. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. నేనేమైనా టెర్రరిస్టునా.. మాఫియా గ్యాంగ్‌స్టర్‌నా.. దుబాయ్ వెళ్లి దాక్కోవడానికి.. నేను ఇక్కడే ఉన్నాను అని శ్రీదేవి అన్నారు. మొన్న డాక్టర్ సుధాకర్, నిన్న డాక్టర్ అచ్చెన్న లాగ నన్ను కూడా చంపుతారేమో అని భయపడి బయటకు రాలేదని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని ప్రాంతంలోని దందాలకు, ఇసుక మాఫియాకు తాను అడ్డు వస్తున్నాననే ఇలా చేస్తున్నారని అన్నారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దోచుకో, తినుకో, పంచుకో (డీపీటీ) అంటుంటారు. అలాంటి వాటికి నేను దూరం కాబట్టే నన్ను టార్గెట్ చేశారని శ్రీదేవి ఆరోపించారు. తాడికొండ నియోకవర్గంలో బినామీలను పెట్టుకొని ఎవరు అక్రమాలు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి వాటికి శ్రీదేవి అడ్డు తగులుతుంది.. ముక్కుసూటి మనిషి.. అక్రమాలు చేయదు.. సాయంత్రం కల్లా డబ్బుల ప్యాకెట్లు తీసుకెళ్లి పంచను అనే తనను తప్పించడానికి ఇలా చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు.

తాడికొండ ఎమ్మెల్యేగా తాను గెలిచిన మొదటి రోజు నుంచి జరుగుతున్న కుట్ర.. తనను తొలగించాలనే ఇలా చేశారని శ్రీదేవి అన్నారు. నేను వైసీపీ అభ్యర్థికి ఓటేయలేదని అంటున్నారు. అక్కడ జరిగింది రహస్య ఓటింగ్.. మరి నేను ఓటేసే టేబుల్ కింద ఎవరినైనా పెట్టారా? లేదంటే సీసీ కెమేరాలు ఉన్నాయా? ఎలా నేను వైసీపీ అభ్యర్థికి ఓటేయలేదని అంటారని శ్రీదేవి ప్రశ్నించారు. నేను ఓటు వేసిన 22 మంది ఎమ్మెల్యేల ప్యానెల్‌లో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఉన్నారు. మరో విశాఖ జిల్లా ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్లెవరినీ అనుమానించకుండా నన్నే ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదన్నారు.

అసంతృప్త ఎమ్మెల్యేలపై అనుమానం వచ్చినా.. నన్ను ఎలాగైనా తొలగించాలని టార్గెట్ పెట్టుకున్నందునే ఇలా చేశారని శ్రీదేవీ మండిపడ్డారు. నన్నొక పిచ్చి కుక్కలాగా ముద్రవేసి బయటకు పంపుతున్నారని చెప్పారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడి పార్టీ అంటే.. అలాంటి విలువలే ఉంటాయని అనుకున్నాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి తాను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను. గత ఏడాది సెప్టెంబర్‌లోనే వేరే వ్యక్తిని తాడికొండ ఇంచార్జిగా నియమించారు. ఎక్కడా లేని విధంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ప్లేసులో వేరే వ్యక్తికి ఇంచార్జి ఇచ్చి నన్ను అవమానించారు. అయినా సరే నేను ఏనాడు పార్టీ లైన్ దాటలేదని శ్రీదేవి అన్నారు.

ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. ప్రాణం పోయినా అమరావతి మన రాజధాని నినాదాన్ని మాత్రం వీడను అని శ్రీదేవి స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా పార్టీలో బానిసగా బతికాను. ఇప్పుడు విముక్తి లభించిందని శ్రీదేవి అన్నారు. నాకు సస్పెన్షన్‌ను బంగారు పళ్లెంలో గిఫ్ట్‌గా ఇచ్చారు. నేను తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శ్రీదేవి చెప్పారు. నా ప్రాణానికి ఎలాంటి హానీ జరగదు అని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తేనే తాను తిరిగి ఏపీలో అడుగు పెడతానని శ్రీదేవి అన్నారు. సజ్జల కారణంగానే తనకు ప్రాణహాని ఉందని మరోసారి చెప్పారు.

కాపు ఓట్ల కోసమే మాకు సీటిచ్చారు : డాక్టర్ శ్రీధర్

తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ గెలిచే అవకాశమే లేదు. కానీ దళిత మహిళ అయిన ఉండవల్లి శ్రీదేవికి జగన్, సజ్జల టికెట్ ఇవ్వడానికి తాను కూడా కారణమని ఆమె భర్త డాక్టర్ శ్రీదర్ అన్నారు. నా భార్య దళితురాలు అయినా.. నేను మాత్రం కాపు కులస్థుడిని.. నియోజకవర్గంలో దాదాపు 15 వేల కాపు ఓటర్లు ఉన్నారు. ఆ లెక్కలు వేసుకొనే.. దళితురాలి వెంట నేను ఉన్నాననే టికెట్ ఇచ్చారు. 2014లో దాదాపు 8 వేల తేడాతో వైసీపీ ఓడిపోయింది. కానీ మేము దాదాపు 4500 ఓట్ల మెజార్టీతో గెలిచాము. ఇందులో కాపుల ఓట్లు కూడా ఉన్నాయని శ్రీధర్ చెప్పారు.

తాము డబ్బు తీసుకొని ఓటేశామని, ఇక్కడ అక్రమాలు చేసి సంపాదించామని ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం డాక్టర్లమే.. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో రెండు ఆసుపత్రులు నిర్వహిస్తున్నాము. మాకు కావల్సినంత డబ్బు ఉన్నది. ఇక మేమెందుకు డబ్బుకోసం ఆశపడతామని శ్రీధర్ అన్నారు. దళిత మహిళ అని చూడకుండా సోషల్ మీడియాలో చాలా నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే దంపతులు చెప్పారు.

First Published:  26 March 2023 12:57 PM IST
Next Story