వైసీపీలోనే వసంత.. జగన్ భేటీతో క్లారిటీ
వైసీపీనుంచి బయటకు వెళ్లడం గ్యారెంటీ అనుకుంటున్న తరుణంలో తాను పార్టీలోనే ఉంటానని, త్వరలోనే గడప గడప కార్యక్రమం మొదలు పెడతానని మీడియా ముందు చెప్పారు వసంత కృష్ణప్రసాద్.
మైలవరం-పెడన పంచాయితీని సీఎం జగన్ తేల్చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలను ఆయన తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వసంతవైపే జగన్ కాస్త మొగ్గు ఎక్కువగా చూపెట్టడంతో ఆయన మెత్తబడ్డారు. వైసీపీనుంచి బయటకు వెళ్లడం గ్యారెంటీ అనుకుంటున్న తరుణంలో తాను పార్టీలోనే ఉంటానని, త్వరలోనే గడప గడప కార్యక్రమం మొదలు పెడతానని మీడియా ముందు చెప్పారు వసంత కృష్ణప్రసాద్.
జోగితోనే పేచీ..
పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన జోగి రమేష్ వచ్చే దఫా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు పెచ్చుమీరాయి. దీనికి తగ్గట్టుగానే జోగి రమేష్, మైలవరంలో తన వర్గాన్ని ప్రోత్సహించడం, వసంత కృష్ణప్రసాద్ పై పరోక్షంగా విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టంచడం.. చేయిస్తున్నారు. దీనిపై గతంలోనే వసంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలపై తనకు ఆసక్తి చచ్చిపోయిందని పలుమార్లు చెప్పారు, గడప గడప కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టలేదు.
జగన్ తో భేటీ తర్వాత..
సీఎం జగన్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. వసంత కృష్ణప్రసాద్ కి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. తనతోపాటు మరో పాతికేళ్లు రాజకీయం చేయాలి అంటూ ఆయన్ను ఓదార్చారు. జోగి రమేష్ తో విభేదాలున్నాయనుకుంటే వెంటనే పిలిపించి మాట్లాడాలని తన కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి చెప్పారు. అదే సమయంలో మైలవరం నియోజకవర్గంలో సమస్యలు కూడా పరిష్కరించాలని, అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.
ఇటీవల కాలంలో అసంతృప్తుల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్న జగన్, వసంత కృష్ణ ప్రసాద్ ని పిలిపించుకుని బుజ్జగించడం విశేషం. తాను పార్టీ వదిలి పెట్టి వెళ్లడం లేదని, ఇకపై గడప గడపలో చురుగ్గా ఉంటానని చెప్పుకొచ్చారు వసంత. మైలవరం వ్యవహారం దాదాపుగా సద్దుమనిగినట్టే చెప్పాలి.