Telugu Global
Andhra Pradesh

టికెట్ ఇవ్వకపోయినా ఓకే.. ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు

తాను మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అని ఎవరూ అనుకోవద్దని చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్. తనను, దేవినేని ఉమాను కాదని మూడో వ్యక్తికి అక్కడ పోటీకి అవకాశం లభించినా వారి గెలుపుకోసమే తాను పనిచేస్తానన్నారు.

టికెట్ ఇవ్వకపోయినా ఓకే.. ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు
X

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడానికి ప్రధాన కారణం జగన్ టికెట్ లేదని చెప్పడమే. అనర్హత వేటు వేయించుకున్న నలుగురు ఎమ్మెల్యేలయినా, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించిన వారయినా.. వైసీపీలో టికెట్ లేదనేసరికి వారికి చంద్రబాబు దేవుడైపోయారు, కొంతమందికి పవన్ కూడా అలాగే కనపడ్డారు. అయితే టీడీపీలోకి వచ్చినా కూడా కొందరికి మొండిచేయి చూపిస్తున్నారు బాబు. నెల్లూరుకి సంబంధించి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ సాధించలేకపోయారు. ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. టికెట్ ఖాయం కాకపోయినా ఆయన టీడీపీలో చేరారు. పోటీకి అవకాశం ఉన్నా, లేకపోయినా పార్టీకోసమే పనిచేస్తానంటూ ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు.

టికెట్ ఎవరికిచ్చినా సరే..

తాను మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అని ఎవరూ అనుకోవద్దని చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్. తనను, దేవినేని ఉమాను కాదని మూడో వ్యక్తికి అక్కడ పోటీకి అవకాశం లభించినా వారి గెలుపుకోసమే తాను పనిచేస్తానన్నారు. అభ్యర్థి ఎవరైనా ప్రచార వాహనంపై అంతే ధీటుగా పని చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే వసంత. తనకు దేవినేని ఉమాకు 20 ఏళ్లకు పైగా రాజకీయ విభేదాలున్నాయని గుర్తు చేసుకున్నారాయన. వైసీపీలో ఉన్నప్పుడు ఉమాకి వ్యతిరేకంగా మాట్లాడానని, అయితే టీడీపీలో ఏ కార్యకర్తను కూడా తాను దూషించలేదన్నారు. అనవసరంగా ఎవరిపై కేసులు పెట్టించలేదని, కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. టీడీపీకి ఈ ఎన్నికలు చాలా కీలకం అని, అందుకే వారి వెంట నడుస్తున్నానని వివరించారు వసంత.

మైలవరం నియోజకవర్గంలో టికెట్ కోసం ఇరు వర్గాలు పట్టుబట్టాయి. మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆ నియోజకవర్గం తనకే కావాలంటున్నారు. కొత్తగా వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కి ఆ స్థానం ఇవ్వొద్దని, అవసరమైతే మరో నియోజకవర్గం చూపించాలని చంద్రబాబుకి అల్టిమేట్టం ఇచ్చారు. ఇటు టికెట్ ఆశతోనే పార్టీలో చేరిన వసంత కూడా చంద్రబాబుపై అదే స్థాయిలో ఒత్తిడి పెంచారు. ఇరు వర్గాలను బుజ్జగించడం బాబుకి సాధ్యం కావడంలేదు, మీలో మీరే తేల్చుకుని రావాలని తేల్చి చెప్పారు. ఈ దశలో ఎమ్మెల్యే వసంత ఇలా కవరింగ్ డైలాగులు కొడుతున్నారు.

First Published:  12 March 2024 2:06 AM GMT
Next Story