Telugu Global
Andhra Pradesh

వంశీ వర్సెస్ సంకల్ప సిద్ధి.. డీజీపీని కలసిన ఎమ్మెల్యే

టీడీపీలో ఉంటే పుణ్యాత్ములు, బయటకొస్తే పాపాత్ములా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే వంశీ. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు టీడీపీ నేతలు పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు.

వంశీ వర్సెస్ సంకల్ప సిద్ధి.. డీజీపీని కలసిన ఎమ్మెల్యే
X

సంకల్ప సిద్ధి సంస్థ చీటింగ్ వ్యవహారంలో వైసీపీ నేతలకు కూడా వాటా ఉందంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీపై నేరుగా ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే వంశీ. టీడీపీలో ఉంటే పుణ్యాత్ములు, బయటకొస్తే పాపాత్ములా అని ప్రశ్నించారు. ఏపీ డీజీపీని స్వయంగా కలసి సంకల్ప సిద్ధి వ్యవహారంలో తనకు కానీ, తన అనుచరులకు కానీ ప్రమేయం లేదని వివరించారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు టీడీపీ నేతలు పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వంశీ.

గతంలో క్యాసినో..

సంక్రాంతి సందర్భంలో క్యాసినో వ్యవహారంలో కూడా తనను ఇలాగే ఇరికించాలని చూశారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే వంశీ. కొడాలి నాని పేరుని కూడా అందులో ఇరికించబోయారని అన్నారు. ఈడీ దర్యాప్తులో తమ ప్రమేయం లేదని తేలిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి సంకల్ప సిద్ధి వ్యవహారంలో తమను ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు వంశీ. అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి తనపై ఆరోపణలు చేశారని.. ప్రజల్లో తన ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకున్నారని చెప్పారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్‌ విసిరారు. ఈ వ్యవహారంపై హైకోర్టుని ఆశ్రయిస్తానన్నారు వంశీ.

సంకల్ప సిద్ధి కేసేంటి..?

గుత్తా వేణుగోపాల్, గుత్తా కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి, 2021 అక్టోబర్ లో ఈ సంస్థకు సంబంధించి ఆన్లైన్ వెబ్ పోర్టల్, యాప్ తయారు చేయించారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లు చేపట్టారు. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్లు ప్రజలనుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్లు క్లోజ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై ఇప్పుడు వైసీపీ నుంచి రియాక్షన్లు మొదలయ్యాయి.

First Published:  2 Dec 2022 8:36 AM IST
Next Story