పట్టాభిపై పరువు నష్టం దావా వేసిన వంశీ
ఈ కంపెనీ నిర్వాహకులు గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్‌లు కొడాలి నాని, వల్లభనేని వంశీల బినామీలని ఆ సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి పట్టాభి ఆరోపించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. ఇందుకోసం గన్నవరం కోర్టులో పిటిషన్ వేశారు వంశీ. సంకల్ప్ సిద్ధి సంస్థ కేసులో పట్టాభి చేసిన ఆరోపణలపై వంశీ ఈ దావా వేశారు.
20వేల రూపాయలు కడితే రోజుకు 200 చొప్పున నెలకు ఆరువేలు ఇస్తామని.. ఇలా 10 నెలల పాటు చెల్లిస్తామని.. ఓవరాల్‌గా 20వేలు కడితే 60వేలు వస్తుందంటూ నమ్మించి ప్రజల నుంచి సంకల్ప్ సిద్ధి సంస్థ డబ్బులు వసూలు చేసింది. ఇలా దాదాపు 11 వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు.
ఈ కంపెనీ నిర్వాహకులు గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్‌లు కొడాలి నాని, వల్లభనేని వంశీల బినామీలని ఆ సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి పట్టాభి ఆరోపించారు. అవే ఆరోపణలు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం ఈ వందల కోట్ల డబ్బును వంశీ, కొడాలి ఇద్దరు బెంగళూరు తరలించారని కూడా పట్టాభి చెప్పారు. ఈ డబ్బుతో కొడాలి, వంశీ కలిసి బెంగళూరులో 600 కోట్ల రూపాయలతో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొనుగోలు చేసినట్టు ప్రచారం చేశారు. వంశీ గడపగడప కార్యక్రమానికి ఫుడ్‌ను ఈ సంకల్ప్ సిద్ధి వాళ్లే సరఫరా చేశారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై నెల క్రితమే డీజీపీని కలిసి వంశీ ఫిర్యాదు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలైనా చూపాలని, లేదా క్షమాపణ అయినా చెప్పాలని పట్టాభి, అర్జునుడికి వంశీ లీగల్ నోటీసులు నెల క్రితం పంపారు. అటు నుంచి సరైన స్పందన రాకపోవడంతో గన్నవరం కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ వేశారు.
అసలు ఈ పరువునష్టం దావా నుంచి ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఎలా తప్పించుకుంటారో ?, వీరిని ఏ వ్యవస్థ కాపాడుతుందో ? ఏ వ్యవస్థలో ఉన్న ఏ పెద్ద మనుషులు వచ్చి రక్షిస్తారో ? తాను చూస్తానని వంశీ సవాల్ చేశారు.