Telugu Global
Andhra Pradesh

తప్పుడు కేసుల ప్రభావం.. సీఐపై ఈసీ వేటు

సీఐ నారాయణ స్వామితోపాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తప్పుడు కేసుల ప్రభావం.. సీఐపై ఈసీ వేటు
X

ఎన్నికల వేళ పల్నాడు అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పల్నాడు అల్లర్ల విషయంలో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఈవీఎం నేలకేసి కొట్టిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదయినా ముందస్తు బెయిల్ లభించింది. మరోవైపు ఆయన్ను అప్పటికప్పుడు పాత కేసుల్లో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయాలనుకున్నారు పోలీసులు. కానీ ఆ కేసుల్లో కూడా కోర్టు బెయిల్ ఇవ్వడంతో పిన్నెల్లికి ఊరట లభించింది. మరోవైపు తనపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఫలితంగా కారంపూడి సీఐ సస్పెండ్ అయ్యారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. హైకోర్టు సూచనతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఐ నారాయణ స్వామిపై చర్యలు తీసుకుంది. ఆయన్ను విధులనుంచి తప్పించింది. అంతే కాదు, ఆయనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణకు కూడా ఆదేశించింది. ఏపీలో ఎన్నికల అల్లర్లపై విచారణ జరుపుతున్న సిట్.. సీఐ నారాయణ స్వామి వ్యవహారంపై కూడా దృష్టి సారించబోతోంది.

సీఐ నారాయణ స్వామితోపాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వేధింపులకు సంబంధించి తగిన ఆధారాలు ఇస్తే.. వారిద్దరిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా.

First Published:  1 Jun 2024 9:44 AM GMT
Next Story