ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తా.. గెలుస్తా.. - ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి
తనపై కేసులు పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని మేకపాటి చెప్పారు. సజ్జల సపోర్ట్ చేస్తున్నవారంతా పరమ వెధవలని అన్నారు.
వైసీపీ నుంచి సస్పెండైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నుంచి ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి గెలుస్తానని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం బెంగళూరుకు వెళ్లిపోయిన ఆయన మంగళవారం ఉదయం ఉదయగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్‌కి పాల్పడలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఏదో సాకు పెట్టి మాత్రమే తనపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వడం లేదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం తనను బాధించిందని ఆయన తెలిపారు. తనకు కిరీటాలూ పెట్టలేదని, ఆర్థికంగా సహకారం కూడా చేయలేదని ఈ సందర్భంగా మేకపాటి చెప్పారు. తన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదుగురు సీటు కోసం తిరుగుతున్నారని తెలిపారు.
తనపై కేసులు పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని మేకపాటి చెప్పారు. సజ్జల సపోర్ట్ చేస్తున్నవారంతా పరమ వెధవలని అన్నారు. టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే తనను సంప్రదించారని, తన పని తాను చేసుకుంటానని, తనను వదిలేయాలని చెప్పానని మేకపాటి చంద్రశేఖరరెడ్డి చెప్పారు.