Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డిని ఓ రేంజ్ లో వాడుతున్న చంద్రబాబు..

ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డిని, ఆమధ్య అమరావతి రైతుల దీక్షా శిబిరానికి రప్పించారు, ఇప్పుడు రాజమండ్రిలో ఎమ్మెల్యే భవానీకి మద్దతుగా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు.

కోటంరెడ్డిని ఓ రేంజ్ లో వాడుతున్న చంద్రబాబు..
X

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఆయన ఇంకా పసుపు కండువా కప్పుకోలేదు, అధికారికంగా టీడీపీలో చేరలేదు. కానీ మెల్ల మెల్లగా టీడీపీకి దగ్గరవుతున్నారు. ముందుగా తన తమ్ముడిని టీడీపీలోకి పంపించారు, తన చేరికపై ఎప్పటికప్పుడు దాట వేస్తున్నా.. ఇటీవల పూర్తిస్థాయి టీడీపీ నేతగా మారిపోయారు కోటంరెడ్డి. తాజాగా ఆయన రాజమండ్రి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కలసి సంఘీభావం తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు సరికాదని మండిపడ్డారు.

సంప్రదాయం, దుష్ట సంప్రదాయం..

ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలే కానీ, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం సరికాదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సమాజంలో మంచి పేరున్న ఆదిరెడ్డి కుటుంబంపై కక్షసాధింపుకి పాల్పడటం దుష్టసంప్రదాయం అన్నారు. ఈ దుష్ట సంప్రదాయాలు ఇలాగే కొనసాగితే అవి సాంప్రదాయాలుగా మారతాయని హెచ్చరించారు. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే నష్టం అని చెప్పారు. రాజ్యాధికారం ఒకరికే శాశ్వతం కాదని, అధికారులు కూడా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

టీడీపీలో చేరిక ఎప్పుడు..?

టీడీపీ నేతల్ని కలసి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న కోటంరెడ్డి, పసుపు కండువా కప్పుకోడానికి మాత్రం ఇంకా టైమ్ రాలేదంటున్నారు. కండువా పడితే అనర్హత వేటు పడే అవకాశముండటంతో ఆయన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతానని అన్నారు కోటంరెడ్డి. రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడులో కూడా తాను పాల్గొనడంలేదన్నారు. మొత్తమ్మీద ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డిని, ఆమధ్య అమరావతి రైతుల దీక్షా శిబిరానికి రప్పించారు, ఇప్పుడు రాజమండ్రిలో ఎమ్మెల్యే భవానీకి మద్దతుగా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు. వైసీపీని ఓ పద్ధతి ప్రకారం కార్నర్ చేసే వాక్చాతుర్యం ఉన్న నేత కావడంతో ఆయన్ని చంద్రబాబు ఓ రేంజ్ లో వాడుతున్నారని అర్థమవుతోంది. వీటికి అదనంగా నెల్లూరు రూరల్ సమస్యలపై కూడా తనదైన శైలిలో ఉద్యమాలు, ఆందోళనలంటూ కోటంరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు.

First Published:  5 May 2023 1:29 AM GMT
Next Story