Telugu Global
Andhra Pradesh

టీడీపీ అభ్యర్థి నేనే.. ఆరు నెలలు సవాళ్లుంటాయి - కోటంరెడ్డి

వైసీపీలోని మరికొందరు నేతలు కూడా టీడీపీలోకి వచ్చేందుకు తనను సంప్రదిస్తున్నారని.. వారిని కూడా తీసుకెళ్తామని టీడీపీని గెలిపిస్తామని కోటంరెడ్డి ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థి నేనే.. ఆరు నెలలు సవాళ్లుంటాయి - కోటంరెడ్డి
X

అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిపక్ష టీడీపీలో చేర‌డం ఖాయమైంది. తన అనుచరుల సమక్షంలో కోటంరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిని తానేనని శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని.. అప్పటి వరకు వైసీపీ నుంచి వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధపడాల్సిందిగా అనుచరులను కోరారు. నెల్లూరు రూరల్ వైసీపీ కార్యాలయం వద్ద ఇప్పటి వరకు జగన్ ఫొటోతో కూడిన కోటంరెడ్డి బ్రదర్స్ ఫ్లెక్సీ ఉండేది. దాన్ని తొలగించేశారు. కేవలం ''జయహో.. కోటంరెడ్డి బ్రదర్స్'' పేరుతో ఏ పార్టీ రంగు లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

జగనే తన జీవితం అనుకుని పనిచేశానని.. ఎవరూ వైసీపీ వైపు చూడని రోజుల్లో జిల్లాలోని పెద్దపెద్ద నాయకులకు ఎదురెళ్లి జగన్‌ పాదయాత్రను భుజాన వేసుకుని తాను నడిపించానన్నారు. కానీ, ఈ ప్రభుత్వంలో తనకు అన్ని అవమానాలే మిగిలాయని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంత విధేయుడినైన తన ఫోనే ట్యాప్‌ చేయడం తనను కలచివేసిందన్నారు. అందుకే తాను పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాబోయే ఆరు నెలల పాటు అనేక వేధింపులు, కేసులు వంటివి ఉంటాయన్నారు. తన అనుచరులు చేసిన పనులకు బిల్లులు కూడా రాకపోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేసి గెలుస్తానని.. ప్రభుత్వం మారగానే అందరి బిల్లులు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు.

వైసీపీలోని మరికొందరు నేతలు కూడా టీడీపీలోకి వచ్చేందుకు తనను సంప్రదిస్తున్నారని.. వారిని కూడా తీసుకెళ్తామని టీడీపీని గెలిపిస్తామని కోటంరెడ్డి ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ అవాస్తవమని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో.. అందుకు ఆధారాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడిస్తానని శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.

First Published:  1 Feb 2023 8:40 AM IST
Next Story