కోటంరెడ్డి హౌస్ అరెస్ట్.. నెల్లూరులో గోలగోల
జలదీక్షకు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే దీక్షకోసం ఇంటి బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కోటంరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నారు. ప్రజా సమస్యలకోసం పోరాడుతున్న ఆయనపై ప్రభుత్వం కక్షగట్టిందని విమర్శిస్తున్నారు.
అసలేం జరిగింది..?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీకి దూరం జరిగాక తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పోరాటపంథా ఎంచుకుంటానని చెప్పారు. గతంలో పలు నిరసనలు ధర్నాలకు పిలుపునివ్వగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల అవి కుదరలేదు. తాజాగా ఆయన జలదీక్ష పేరుతో నెల్లూరు - జొన్నవాడ మధ్య ఉన్న పొట్టేపాలెం కలుజు వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, సాక్షాత్తూ సీఎం సంతకం చేసినా కూడా ఇంకా పునాది రాయి పడలేదని, ప్రతిపాదనలు సిద్ధం కాలేదని ఆయన ఆరోపిస్తున్నారు. రోజంతా కలుజు వద్ద నీటి ప్రవాహంలో కూర్చుని జలదీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. అయితే అక్కడ ట్రాఫిక్ సమస్యలుంటాయని, జనం ఎక్కువగా వస్తే, పొరపాటున ఎవరైనా నీటి ప్రవాహంలో పడే అవకాశం ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. జలదీక్షకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే దీక్షకోసం ఇంటి బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసులు తన ఇంటి వద్ద ఉన్నన్ని రోజులూ తాను కూడా బయటే కూర్చుంటానని భీష్మించుకు కూర్చున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. పోలీసులు వెళ్లిపోతే తాను కచ్చితంగా కలుజు వద్దకు వెళ్తానన్నారు. తాను వెళ్లకూడదు అనుకుంటే కచ్చితంగా ప్రభుత్వం జీవో ఇవ్వాలన్నారు. బారాషహీద్ దర్గా అభివృద్ధికోసం ఇచ్చినట్టు డూప్ జీవో కాకుండా.. ఆర్థిక శాఖ జీవో ఇచ్చి పనులు మొదలు పెట్టాలన్నారు. లేకపోతే తన పోరాటం కొనసాగిస్తానన్నారు.