Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డిది కూడా ఆనం దారేనా?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమింటటే జగన్‌కు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి కూడా ఒకరు. పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవిని ఆశించారు. అయితే అది దక్కకపోవటంతో అసంతృప్తి మొదలైంది.

కోటంరెడ్డిది కూడా ఆనం దారేనా?
X

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన మాటలకు, బహిరంగంగా మాట్లాడాల్సిన మాటలకు మధ్య తేడాను మరచిపోవటమే అసలు సమస్య. రెగ్యులర్‌గా ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడేయటం లేదా ఆరోపణలు చేయటం ద్వారా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలనం సృష్టించేవారు. దాంతో ప్రభుత్వ ప్రతిష్టపై సొంత ఎమ్మెల్యేనే బురదచల్లినట్లయ్యేది. దాంతో ఇక ఉపేక్షించి లాభంలేదని అనుకుని ఆనంను ప్రభుత్వం పక్కనపెట్టేసింది.

ఆనం సరిపోరన్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా అలాగే తయారయ్యారు. దీంతో కోటంరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. అయితే ఆయనలో ఏమాత్రం మార్పురాలేదని అర్థ‌మవుతోంది. తాజాగా తన ఫోన్‌ను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని, తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘాపెట్టారంటు గోల మొదలుపెట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నా, నిఘాపెట్టారన్నా అర్ధముంది కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయటం, నిఘా పెట్టడం ఏమిటని అడుగుతున్నారు. ఎమ్మెల్యేనే కాదు మంత్రులపైన కూడా ప్రభుత్వం నిఘా పెడుతుందన్న విషయం ఎమ్మెల్యేకి తెలియకపోవటమే విచిత్రంగా ఉంది.

ఇంతకుముందు కూడా అభివృద్ధిపనులకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయటం లేదంటు బహిరంగంగానే నానా గోలచేశారు. మురుగుకాల్వల్లోకి దిగి నిరసన వ్యక్తంచేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమింటటే జగన్‌కు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి కూడా ఒకరు. పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవిని ఆశించారు. అయితే అది దక్కకపోవటంతో అసంతృప్తి మొదలైంది.

మంత్రి పదవి దక్కకపోయినా కనీసం స్పీకర్, డిప్యుటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటివి కూడా దక్కలేదు. దాంతో తనకన్నా జూనియర్లకు అన్నీ ఇచ్చి తనను దూరంగా ఉంచారనే మంట పెరిగిపోయింది. ఆ మంటే అసంతృప్తి రూపంలో బయటపడుతోంది. నిజానికి సోషల్ ఇంజనీరింగ్ రూపంలో మంత్రి పదవులతో పాటు అనేక కీలక పదవులను జగన్ ఎక్కువగా బీసీలు, కాపులు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కేటాయిస్తున్నారు. దీంతో రెడ్డి సామాజికవర్గానికి పదవులు బాగా తగ్గిపోయాయి. దీన్ని అర్థంచేసుకోకుండా కోటంరెడ్డి ప్రభుత్వంపైనే బండలేస్తున్నారు. దాంతో కోటంరెడ్డి కూడా ఆనం దారిలోనే వెళుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  30 Jan 2023 11:18 AM IST
Next Story