Telugu Global
Andhra Pradesh

జగన్ సర్కారుకి కోటంరెడ్డి రిటర్న్ గిఫ్ట్..

గన్ మెన్లను తీసుకుని ప్రభుత్వం తనకు గిఫ్ట్ ఇచ్చాననుకుంటోందని, కానీ తానే ప్రభుత్వానికి మిగిలిన ఇద్దరు గన్ మెన్లను తిరిగి ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.

జగన్ సర్కారుకి కోటంరెడ్డి రిటర్న్ గిఫ్ట్..
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలకు ప్రతి విమర్శలతో వైసీపీ నేతలకు, అధిష్టానానికి కాస్త ఘాటుగానే హెచ్చరికలు పంపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా.. దానికి గట్టి రియాక్షన్ ఇస్తున్నారు. తాజాగా ఏపీ సర్కారు ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఉన్న ఇద్దరు గన్ మెన్లను తొలగించింది. ఆయన భద్రతను 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1 కి తగ్గించింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, తనకు గన్ మెన్లు తగ్గించిన ప్రభుత్వానికి ధన్యవాదాలంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఇద్దరు గన్ మెన్లు కూడా తనకు వద్దని చెప్పి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తున్నానని ప్రకటించారు.

గన్ మెన్లను తీసుకుని ప్రభుత్వం తనకు గిఫ్ట్ ఇచ్చాననుకుంటోందని, కానీ తానే ప్రభుత్వానికి మిగిలిన ఇద్దరు గన్ మెన్లను తిరిగి ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సినిమా డైలాగులు అనుకోవద్దని, తాను మాత్రం తగ్గేది లేదని అన్నారు కోటంరెడ్డి.

ఇది కక్షసాధింపే..

తన విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ముమ్మాటికీ కక్షసాధింపేనంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకిప్పుడు సెక్యూరిటీ పెంచాల్సిందిపోయి తగ్గించడమేంటని నిలదీశారు. గన్ మెన్ల విషయంలో ఏఎస్పీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తనకు ప్రజలు, అభిమానులే రక్ష అని, ఏకే 47ల రక్ష తనకు అక్కర్లేదన్నారు. ఇప్పుడిక మరింత కసితో ముందుకెళ్తానని స్పష్టం చేశారు.




గన్ మెన్ల భావోద్వేగం..

రూరల్ ఎమ్మెల్యేని వదిలి వెళ్తున్నందుకు గన్ మెన్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గన్ మెన్లు ఇద్దరూ ప్రెస్ మీట్ జరుగుతుండగానే ఆయన వద్దకు వచ్చి కంటతడి పెట్టారు. వారిద్దరినీ ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నిన్న రాత్రి ఇద్దరు గన్ మెన్లు కూడా ఇలాగే కన్నీరు పెడుతూ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

First Published:  5 Feb 2023 11:10 AM IST
Next Story