Telugu Global
Andhra Pradesh

కోర్టు మెట్లెక్కిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?

రేపో మాపో ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేస్తారనే పుకారు మొదలైంది. ఎమ్మెల్యే పేరు కూడా నిందితుల జాబితాలో ఉందని పోలీసులు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే అప్రమత్తం అయ్యారు.

కోర్టు మెట్లెక్కిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?
X

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, అన్యాయంగా తనను ఆ కేసులో ఇరికించారని కోర్టుకి విన్నవించారు. తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ చట్టం, హత్యాయత్నం కేసుని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అసలేం జరిగిందంటే..?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీలో ఉన్న సమయంలో రూరల్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ కార్యకర్త మాతంగి కృష్ణపై దాడి జరిగింది. 2022 అక్టోబర్ లో జరిగిన ఈ ఘటనలో కొంతమంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టంతోపాటు, హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో రూరల్ ఎమ్మెల్యేపై కేసు నమోదు కాలేదు. అప్పట్లో అరెస్ట్ లు కూడా జరగలేదు. తాజాగా ఆయన అధిష్టానానికి ఎదురు తిరిగి పార్టీనుంచి బయటకొచ్చేశారు. దీంతో ఆ కేసు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ కేసులో నిందితులుగా ఉన్నవారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం మొదలైంది. రూరల్ ఎమ్మెల్యే అనుచరులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. రేపో మాపో ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేస్తారనే పుకారు మొదలైంది. ఎమ్మెల్యే పేరు కూడా నిందితుల జాబితాలో ఉందని పోలీసులు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే అప్రమత్తం అయ్యారు.

ఇప్పటికే ఎమ్మెల్యే వైపు నుంచి కార్పొరేటర్లు ఒక్కొక్కరే చేజారిపోతున్నారు. త్వరలో ఆయన నెల్లూరు రూరల్ లో ఇంటింటికీ ఆశీర్వాద యాత్ర చేపట్టాలనుకుంటున్నారు. ఈ దశలో అరెస్ట్ జరిగితే కచ్చితంగా క్యాడర్ చిన్నాభిన్నమవుతుంది, ఆశీర్వాద యాత్రకు బ్రేక్ పడుతుంది, పొలిటికల్ కెరీర్ కి కూడా అది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆయన తన అరెస్ట్ ని అడ్డుకోడానికి హైకోర్టులో పిటిషన్ వేశారు.

రాజకీయ కారణాలతో నాలుగు నెలల తర్వాత పిటిషనర్‌ ను కేసులో నిందితుడిగా చేర్చారని కోటంరెడ్డి తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. పిటిషనర్‌ దాడి చేయించారని ఫిర్యాదుదారుడు తన కంప్లయింట్ లో పేర్కొనలేదని చెప్పారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని అన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితుడికి నోటీసు ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి వీల్లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఫిర్యాదుదారుడి వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులకు, ఫిర్యాదుదారుడికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేశారు.

First Published:  23 Feb 2023 11:22 PM GMT
Next Story