Telugu Global
Andhra Pradesh

వైసీపీలో మరో వికెట్.. ఎమ్మెల్యే కాపు రాజీనామా

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే క్రమంలో ఆయన జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. జగన్ ని నమ్మి కాంగ్రెస్ నుంచి వచ్చామని, మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని, వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కాపు.

వైసీపీలో మరో వికెట్.. ఎమ్మెల్యే కాపు రాజీనామా
X

వైసీపీలో మరో వికెట్ పడింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ లేదు అని తెలిసిన మరుక్షణం ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎం జగన్ ని కలశారు ఎమ్మెల్యే కాపు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు టికెట్ లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కాపు రామచంద్రారెడ్డి.

మా జీవితాలు నాశనం..

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే క్రమంలో ఆయన జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. జగన్ ని నమ్మి కాంగ్రెస్ నుంచి వచ్చామని, మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని, వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కాపు. జగనే తమ సర్వస్వం అనుకుంటే జీవితాలు నాశనం అయ్యాయన్నారు. గడప గడపకు తిరిగామని, పార్టీకి అనుకూలంగా నడుచుకున్నామని, జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామని, చివరకిలా టికెట్ లేదని చెప్పడం సరికాదన్నారు. సర్వే పేరు చెప్పి టికెట్ నిరాకరించడం బాధగా ఉందన్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.

తేల్చుకుంటా..

కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో తిరిగి వైసీపీ టికెట్ పై గెలిచారు. జగన్ మంత్రి వర్గంలో సీటు ఆశించారు కానీ దక్కలేదు. అప్పటినుంచి ఆయన అసంతృప్తిలోనే ఉన్నారు. చివరకిప్పుడు టికెట్ లేదని చెప్పడంతో కాపు రామచంద్రారెడ్డి ధిక్కార స్వరం వినిపించారు. కల్యాణదుర్గం నుంచి తను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని తెల్చి చెప్పారు. అయితే ఆయన షర్మిల అండతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తమ్మీద వైసీపీలో మరో వికెట్ పడిందని తేలిపోయింది. ఇన్ చార్జ్ ల ప్రకటనతో ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన అసంతృప్తి బయటపెట్టారు. ఈరోజు కాపు రాజీనామా అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

First Published:  5 Jan 2024 1:13 PM GMT
Next Story