బావమరిది లీల.. బావ గోల..
పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయని భావించిన సాయి, ఏకంగా పార్టీ పెద్దలతో సంబంధాలు పటిష్టం చేసుకోవడం ఆరంభించారు. అటు శ్రీకాకుళం జిల్లాలో మంత్రితోనూ, ఇటు విజయనగరం జిల్లాలో మంత్రితోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు.
వాళ్లిద్దరూ బావబావమరుదులు. అక్కని వివాహం చేసుకున్న బావ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాడు. బావ భవిష్యత్తు కోసం బావమరిది ఎంతో కష్టపడ్డాడు. ఆ బావబావమరుదులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రణస్థలం ఎంపీపీ భర్త పిన్నింటి సాయిసురేష్‌కుమార్. ఒకప్పుడు కృష్ణార్జునుల్లా కలిసున్న వీళ్లిద్దరూ పదవులు దక్కాక, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక బద్ధశత్రువుల్లా మారారు.
టీడీపీ అభ్యర్థి కళా వెంకటరావుపై 2014లో గొర్లె కిరణ్ కుమార్ ఓడిపోయారు. అప్పటికే రణస్థలం ఎంపీపీగా ఆయన భార్య ఉన్నా పెత్తనమంతా కిరణ్‌దే. రాజకీయంగా దివంగత మాజీ మంత్రి గొర్లె శ్రీరాములునాయుడు లెగసీ కలిసొచ్చింది. ఆ పెద్దాయన తమ్ముడు కొడుకుగా గొర్లె కిరణ్ పట్ల నియోజకవర్గంలో ఓ సానుభూతి ఏర్పడింది. ఇదే సమయంలో తన అక్క భర్త కిరణ్‌కుమార్‌కి ప్రజాసంబంధాలు కొనసాగించడంలో నిర్లక్ష్య వైఖరి నష్టం చేస్తుందని భావించిన బావమరిది సాయిసురేష్ కుమార్ నియోజకవర్గంలో అంతా తానై చక్కబెడుతూ వచ్చారు. కిరణ్ కూడా అన్నీ పనులు చక్కబెట్టే బాధ్యతని బావమరిది సాయికే అప్పగించాడు.
టీడీపీ నుంచి గెలిచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కూడా అయిన కిమిడి కళా వెంకటరావు తన నియోజకవర్గాన్ని, కేడర్‌ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆయన కూడా తన బావమరిది జడ్డు విష్ణుని షాడో ఎమ్మెల్యేని చేయడంతో నియోజకవర్గంలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దీన్ని వైసీపీ బలంగా మార్చడంలో సాయి చాలా వ్యూహాత్మకంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావుని భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ ఓడించారు. ఈ గెలుపు తన బావమరిది సాయి కృషివల్లేనని కిరణ్ బలంగా నమ్మేవారు. సాయి కూడా ఎమ్మెల్యేకి మాట రాకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో వివాహాది శుభకార్యాలు, పరామర్శలు, సహాయాలు చేస్తూ సత్సంబంధాలు పెంచుకున్నాడు. రణస్థలం ఎంపీపీగా సాయి భార్యని ఎంపిక చేశారు. ఇటు ఎంపీపీ ప్రతినిధిగా, అటు ఎమ్మెల్యే ప్రతినిధిగా సాయి స్థాయి జిల్లా, రాష్ట్ర పార్టీ వరకూ విస్తరించింది.
ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ సొంత పార్టీ నేతల నుంచే ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కి అసమ్మతి మొదలైంది. కిరణ్ వద్దు-జగన్ ముద్దు అంటూ ప్రతీ మండలం నుంచి నిరసనలు ఆరంభం అయ్యాయి. వీటి వెనుక తన బావమరిది సాయి ఉన్నాడనే అక్కసుతో అతన్ని కిరణ్ దూరం పెట్టాడు. అప్పటి నుంచి సాయి తన లైజనింగ్‌ని నియోజకవర్గ ప్రజలు, పార్టీ పెద్దలతో డైరెక్టుగా నెరపడం ఆరంభించారు. బావ దూరం పెట్టడం తనకి ఎమ్మెల్యే టికెట్టుని దగ్గర చేయడమేనని భావించిన సాయి తనదైన వ్యూహరచనలో వున్నారు.
తనకి టికెట్ ఇవ్వవద్దని కేడర్ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ టికెట్ తనదేనని సంకేతాలు పంపడానికి జూలై 13న ఎచ్చెర్ల ఎమ్మెల్యే తన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిపారు. ఈ వేడుకలకి సొంత బావమరిది, రణస్థలం ఎంపీపీ ప్రతినిధి సాయికి ఆహ్వానం కూడా లేదు.
పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయని భావించిన సాయి, ఏకంగా పార్టీ పెద్దలతో సంబంధాలు పటిష్టం చేసుకోవడం ఆరంభించారు. అటు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావుతోనూ, ఇటు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణతోనూ సాయి సమాన సంబంధాలు కొనసాగిస్తున్నారు. వైసీపీలో పలుకుబడి బాగా ఉన్న ఉత్తరాంధ్ర నేత మజ్జి శ్రీను(చిన్న శ్రీను)తో టచ్‌లో ఉన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వొద్దంటూ అన్ని మండలాల వైసీపీ నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఐ-ప్యాక్ నివేదికలు ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని ఇచ్చేశాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌కి కాకపోతే తనకే టికెట్ ఇవ్వాలంటూ బావమరిది పిన్నింటి సాయిసురేష్‌కుమార్ చేస్తున్న ప్రయత్నాలతో బావ బేజారెత్తిపోతున్నారు.