గంటా కూడా శపథం చేశారా?
ముఖ్యమంత్రిగానే తాను అసెంబ్లీలోకి అడుగుపెడతానని ఆ మధ్య చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేశారు. నాటి నుండి ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు.అదే పద్ధతిలో.. మంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని గంటా శ్రీనివాసరావు ఏమన్నా శపథం చేశారా అని పార్టీలో సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయమే టీడీపీ వర్గాల్లో బాగా చర్చనీయాంశమవుతోంది. చాలా కాలంగా చిక్కడు దొరకడు లాగ వ్యవహరించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పార్టీతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్‌లో కనబడుతున్నారు. మొన్న జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ విజయానికి బాగా కష్టపడ్డారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి గంటా అసెంబ్లీలో మాత్రం ఎక్కడా కనబడటం లేదు.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు స్థానిక నేతలకు కూడా గంటా దొరికేవారు కాదు. అలాంటిది ఏమనుకున్నారో ఏమో రెగ్యులర్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్విట్టర్లో బాగా జోరు పెంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి చిరంజీవిరావు తరపున యాక్టివ్ రోల్ తీసుకుని కాపులను ఏకం చేయటానికి గంటా బాగా కష్టపడ్డారని పేరు తెచ్చుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కనబడటం లేదు.
ఇక్కడే అందరిలోనూ ఒక అనుమానం మొదలైంది. ముఖ్యమంత్రిగానే తాను అసెంబ్లీలోకి అడుగుపెడతానని ఆ మధ్య చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే భీకరమైన శపథం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. అదే పద్ధతిలో తాను కూడా మంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెడతానని గంటా శ్రీనివాసరావు ఏమన్నా శపథం చేశారా అని పార్టీలో సెటైర్లు వేస్తున్నారు. పార్టీలో యాక్టివ్ అవుతున్న గంటా మరి అసెంబ్లీలో మాత్రం ఎందుకని కనబడటం లేదు? అనే విషయం తమ్ముళ్ళకే అర్థం కావటంలేదు.
పార్టీకి ఉన్నదే 19 మంది ఎమ్మెల్యేలు. ఇందులో చంద్రబాబు హాజరుకావడం లేదు. అలాంటపుడు ప్రభుత్వంపై రెగ్యులర్‌గా విరుచుకుపడుతున్న గంటా అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గొంతు విప్పితే మీడియా కూడా విస్తృతమైన ప్రాధాన్యతను ఇస్తుంది. ప్రచారం విషయంలో ఉన్న ఇన్ని అవకాశాలను గంటా ఎందుకు మిస్సవుతున్నారో అర్థం కావటం లేదు. మొత్తానికి గంటా తన విలక్షణమైన వ్యక్తిత్వంతో అందరికీ భలే సర్ ప్రైజులు ఇస్తుంటారు. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరీ అర్థంకారు.