Telugu Global
Andhra Pradesh

పవన్ కి వంతపాడిన రామోజీ.. చీవాట్లు పెట్టిన ద్వారంపూడి

ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ద్వారంపూడి. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని, కావాలంటే విచారణ చేయించుకోవచ్చని చెప్పారు.

పవన్ కి వంతపాడిన రామోజీ.. చీవాట్లు పెట్టిన ద్వారంపూడి
X

ఆమధ్య పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అదే స్థాయిలో ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా పవన్ కి బదులిచ్చారు. అయితే ఆ విమర్శలు, ప్రతి విమర్శలు పూర్తిగా వ్యక్తిగతంగా మారాయి. కానీ ఇప్పుడు ఈనాడు మధ్యలో ఎంటరైంది. అప్పుడు పవన్ ఏయే విమర్శలు చేశారో, ఇప్పుడు అవే విమర్శలను అక్షరబద్ధం చేసింది ఈనాడు. తానే పరిశోధించినట్టుగా కథనాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈనాడుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి. రామోజీరావు కుల కుట్రలు చేస్తున్నారని అన్నారు. రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా? అని ప్రశ్నించారాయన.

ఎందుకీ ఆరోపణలు..?

మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. టీడీపీ నేతలు మద్దతుగా మాట్లాడుతున్నా ప్రజలు పట్టించుకోవడంలేదు. అదే సమయంలో పవన్ సపోర్ట్ కోరారు రామోజీ. వారాహి యాత్రలో ఉన్న పవన్ ఈనాడుకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్గదర్శి కేసులన్నీ రాజకీయ కక్షసాధింపులేనని అన్నారు. అయితే పవన్ మద్దతు ఊరికే పోలేదు. వారాహి యాత్రను ఈనాడు భుజంపై మోసింది. మళ్లీ ఇప్పుడు పవన్ మెప్పుకోసం ఎమ్మెల్యే ద్వారంపూడిని టార్గెట్ చేసింది. ఆయన్ని ఓ విలన్ గా చిత్రీకరిస్తూ ఈనాడు మెయిన్ ఎడిషన్లో కథనాలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఎమ్మెల్యేని ఈ స్థాయిలో ఎప్పుడూ ఈనాడు టార్గెట్ చేయలేదు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి నేరుగా రామోజీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ద్వారంపూడి. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని, కావాలంటే విచారణ చేయించుకోవచ్చని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం సరికాదన్నారు. తనపై ఆరోపణలు నిజం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. సీఎం జగన్‌ ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే రామోజీ ఇలా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని అన్నారు ద్వారంపూడి.

చంద్రబాబు, రామోజీ.. రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు అని తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి. రామోజీ వల్లే రాష్ట్రంలో కులాల ఘర్షణలు జరిగాయన్నారు. అబద్దాన్ని నిజం చేయడంలో దిట్ట రామోజీ అని మండిపడ్డారు. కాకినాడలో వాస్తవ పరిస్ధితులు తెలుసుకోవాలని హితవు పలికారు.

First Published:  6 July 2023 6:37 PM IST
Next Story