Telugu Global
Andhra Pradesh

చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రారు.. ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాలకు సరిపోను అనుకునే చిరంజీవి మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారని ద్వారంపూడి చెప్పారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజలను అలరించడం మంచి పరిణామం అని, ఆయనకు సినిమాల్లోనే సౌకర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రారు.. ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
X

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రారు.. అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇటీవల సినిమాల కంటే రాజకీయంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి ప్రభుత్వంపై విమర్శలు చేసి వైసీపీ నాయకులకు టార్గెట్‌గా మారారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి ప్రభుత్వానికి దగ్గరగానే మసలు కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పలు పథకాల గురించి చిరంజీవి అభినందనలు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.

చిరంజీవి తమ పార్టీకి మద్దతుదారుడు అని వైసీపీ నాయకులు కూడా పలుమార్లు అభిప్రాయపడ్డారు. అయితే చిరంజీవి ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, అనుకోకుండా మాట్లాడారో తెలియదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. దీంతో వైసీపీ మంత్రులు, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వరుసబెట్టి చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడారు.

ఇదిలా ఉండగా చిరంజీవి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి కేవలం 18 స్థానాల్లో గెలుపొంది ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి ఎలాగైనా విజయం సాధించాలని చిరంజీవి భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం జనసేనలో చేరడానికి చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. రాజకీయాలకు సరిపోను అనుకునే చిరంజీవి మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారని చెప్పారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజలను అలరించడం మంచి పరిణామం అని, ఆయనకు సినిమాల్లోనే సౌకర్యంగా ఉందని ద్వారంపూడి వ్యాఖ్యానించారు. చిరంజీవిపై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

First Published:  11 Aug 2023 1:13 PM IST
Next Story