Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేగా వద్దు అంటే.. టీచర్ గా వెళ్లిపోతా..

ఒకవేళ తన రాజీనామా లేఖను ఆమోదిస్తే, తాను టీచర్ ఉద్యోగంలో చేరిపోతానంటున్నారు ఎమ్మెల్యే ధర్మశ్రీ. తన సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్ కి పంపించానన్నారాయన.

ఎమ్మెల్యేగా వద్దు అంటే.. టీచర్ గా వెళ్లిపోతా..
X

ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని రావాలని, విశాఖను రాజధాని కాకుండా ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇటీవలే ఎమ్మెల్యే ధర్మశ్రీకి టీచర్ పోస్ట్ వచ్చింది. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ లిస్ట్ లో ఆయన పేరు కూడా ఉంది. 1998 డీఎస్సీ రాసి ఫలితాల విషయంలో గందరగోళం ఏర్పడి ఇన్నాళ్లూ పోస్ట్ ల కోసం వేచి చూసిన వారు ఇటీవల సీఎం జగన్ నిర్ణయంతో ఉద్యోగాలు సాధించారు. అందులో ధర్మశ్రీ కూడా ఒకరు. ఒకవేళ తన రాజీనామా లేఖను ఆమోదిస్తే, తాను టీచర్ ఉద్యోగంలో చేరిపోతానంటున్నారు ధర్మశ్రీ. తన సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్ కి పంపించానన్నారాయన.

అమరావతి వర్సెస్ అరసవెల్లి..

రాజధాని ప్రాంత రైతులు అమరావతి టు అరసవెల్లి అనే యాత్రను మొదలు పెట్టినా అది చివరకు అమరావతి వర్సెస్ అరసవెల్లిగా మారుతోంది. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనివ్వబోమంటూ వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. మాపై దండయాత్ర చేస్తారా అంటూ మంత్రులు మండిపడుతున్నారు. అమరావతి యాత్ర అరసవెల్లి వచ్చేలోపు అటు విశాఖలో జేఏసీ ఏర్పడింది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా జేఏసీ ఉద్యమానికి సిద్ధం అని చెబుతోంది. వైసీపీ నేతల మద్దతుతో కొన్ని ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లోనే వైసీపీ నేతలు రాజీనామా సవాళ్లు విసిరారు. విశాఖ కోసం తాము రాజీనామా చేస్తున్నామన్నారు, దమ్ముంటే అమరావతికోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తొలి సంతకం చేశారు. స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖ రాసి జేఏసీ నాయకులకు అందించారు.

అయితే ఈ లేఖపై కూడా టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేయలేదని, వైసీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. అటు అమరావతి రైతులు కూడా రాజీనామాలపై మండిపడుతున్నారు. సమస్యని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి రాజీనామా లేఖతో ఉత్తరాంధ్రలో కలకలం రేపారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. రాజీనామా ఆమోదిస్తే టీచర్ గా కొనసాగుతానని కూడా క్లారిటీ ఇచ్చారు.

First Published:  9 Oct 2022 11:28 AM IST
Next Story