నాకు రిటైర్మెంట్ ఇప్పించండి.. మా అబ్బాయిని గెలిపించండి
2024 ఎన్నికలకు సంబంధించి తాను సీఎం జగన్ వెంట ఉండాల్సి వస్తోందని, అందుకే నియోజకవర్గానికి దూరంగా ఉంటానని, ఆ బాధ్యతలు తన కొడుకు మోహిత్ రెడ్డికి అప్పగిస్తున్నానని చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. తన బదులు తన కొడుకు మోహిత్ రెడ్డి, చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని, ఆయన్ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ అనుమతితో తాను ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు చెవిరెడ్డి. తిరుపతిలోని శిల్పారామంలో చంద్రగిరి నియోజకవర్గ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన కీలక ప్రకటన చేశారు.
చెవిరెడ్డికి ముఖ్యమైన పని..
2024 ఎన్నికలకు సంబంధించి తాను సీఎం జగన్ వెంట ఉండాల్సి వస్తోందని, అందుకే నియోజకవర్గానికి దూరంగా ఉంటానని, ఆ బాధ్యతలు తన కొడుకు మోహిత్ రెడ్డికి అప్పగిస్తున్నానని చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనలాగే తన కొడుకుని కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నతనం వల్ల తెలిసో తెలియకో ఎవరినైనా మోహిత్ రెడ్డి నొప్పించి ఉంటే.. పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.
దూరంగా ఉన్నా దగ్గరివాడినే..
నియోజకవర్గానికి దూరంగా ఉన్నా.. జగనన్నకు దగ్గరగా ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా, ప్రత్యేక నిధులు మంజూరైనా మొదటగా చంద్రగిరికి తీసుకుని వస్తానని చెప్పారు చెవిరెడ్డి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో రూ.430 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశామని, మరో రూ.90కోట్లతో కొత్త పనులు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. ఏడాది ముందే చంద్రగిరికి అభ్యర్థిని ప్రకటించేసి, నియోజకవర్గంలోకి పంపిస్తున్నారు చెవిరెడ్డి. గడప గడప కార్యక్రమంలో మోహిత్ రెడ్డి ఇప్పటికే చాలా గ్రామాలు చుట్టేశారు. ఇకపై వైసీపీ అభ్యర్థిగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం కూడా చేపడతారనమాట.