Telugu Global
Andhra Pradesh

హిందూపురంలో టీడీపీ '108'

అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు.. మన హిందూపురం - మన బాలయ్య అనే పేరుతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ వాహనాన్ని సిద్ధం చేశారు.

హిందూపురంలో టీడీపీ 108
X

వైసీపీ సంక్షేమ పథకాలను ఎదుర్కొనేందుకు టీడీపీ సొంత పథకాలను సిద్ధం చేస్తోందా..? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. టీడీపీ ప్రాబల్యం ఉన్న చోట్ల అన్న క్యాంటీన్లను తిరిగి తెరుస్తున్నారు. 5 రూపాయల నామమాత్రపు రుసుముకే అన్నం పెడుతున్నారు, వీలైతే ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అటు మంగళగిరిలో నారా లోకేష్ సొంత ఖర్చుతో రోడ్లు వేయిస్తున్నారు. తాజాగా హిందూపురంలో టీడీపీ '108' వాహనం వచ్చేసింది. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఈ వాహనాన్ని సిద్ధం చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ.

ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథం

అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు.. మన హిందూపురం - మన బాలయ్య అనే పేరుతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ వాహనాన్ని సిద్ధం చేశారు. 200 పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యులతో కన్సల్టేషన్, మాతాశిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు గ్రామాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఈ వాహనాన్ని రూపొందించారు. దీనికోసం రూ.40 లక్షల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ప్రారంభిస్తారు. ఒక డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఆరుగురు వైద్య సిబ్బంది ఈ ఉచిత ఆరోగ్య రథంలో ఉంటారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగానే పేదలకు మందులు పంపిణీ చేస్తారు. ఇతర వైద్యసేవలు అవసరమున్నవారిని పెద్దాసుపత్రులకు తరలిస్తారు. నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో ఒక రోజు ఈ వాహనాన్ని నిలుపుతామని చెబుతున్నారు టీడీపీ నాయకులు.

చంద్రబాబు బొమ్మ లేదేంటి..?

ఎన్టీఆర్ ఆరోగ్యరథం అనే పేరుతో తయారైన ఈ వాహనంపై చంద్రబాబు బొమ్మ లేకపోవడం గమనార్హం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. టీడీపీకి కంచుకోటలా ఉన్న హిందూపురంలో ఈసారి పరిస్థితి తారుమారవుతుందనే అనుమానాలు ఉండటంతో ముందుగానే ఎమ్మెల్యే బాలకృష్ణ జాగ్రత్తపడుతున్నారని అంటున్నారు. అయితే హిందూపురం వైసీపీలో కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువ కావడంతో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది.

First Published:  14 Aug 2022 10:26 AM IST
Next Story