ఆ విషయంలో నాకు సిగ్గు, శరం, మానం.. ఏవీ లేవు
తనకు సహజంగానే కోపం, రోషం కాస్త ఎక్కువని, కానీ జగన్ తనను గెటౌట్ అన్నా కూడా వెళ్లలేనని.. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏవీ లేవన్నారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు సిటీ టికెట్ తనకు ఇవ్వకపోయినా తాను మాత్రం పార్టీని వదిలిపెట్టేది లేదన్నారు. జగన్ తనను గెటౌట్ అన్నా కూడా పార్టీని వదిలిపెట్టి పక్కకు పోయే ప్రసక్తే లేదని చెప్పారు. ఇటీవల వచ్చిన పుకార్లపై అనిల్ నేరుగా స్పందించారు. జగన్ వద్దన్నా కూడా తాను ఆయన వెంటే ఉంటానని, జగన్ అంటే తనకు ఒక వ్యసనం అని చెప్పుకొచ్చారు అనిల్. తనకు సహజంగానే కోపం, రోషం కాస్త ఎక్కువని, కానీ జగన్ తనను గెటౌట్ అన్నా కూడా వెళ్లలేనని.. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏవీ లేవన్నారు.
ఆయనతో కలిసేది లేదు..
ఇటీవల కావలి పర్యటన సందర్భంగా అనిల్ కుమార్ యాద్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ మధ్య సయోధ్యకు సీఎం జగన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వారిద్దరి చేతులు కలిపి మరీ కలసి ఉండాలని కోరారు జగన్. కానీ అనిల్ మాత్రం ఆ విషయంలో ససేమిరా అంటున్నారు. అలాంటివారితో తాను కలసి పనిచేయలేనన్నాకు. ముందు నవ్వుతూ మాట్లాడి, వెనక వెన్నుపోటు పొడిచే నైజం తనది కాదన్నారు. జగన్ చెప్పినా ఆ మనిషితో కలిసేది లేదని క్లారిటీ ఇచ్చారు అనిల్.
తప్పుడు కథనాలు..
తాను పార్టీ మారుతున్నానంటూ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించారు అనిల్. మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నానని, కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటానని, గడప గడప కార్యక్రమంలో కూడా పాల్గొనడంలేదని వివరించారు. దీన్ని అడ్డం పెట్టుకుని.. అనిల్ అలిగాడు, పార్టీ మారుతున్నాడంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. నెల్లూరు సిటీకి సంబంధించి మైనార్టీలకు పెద్ద పదవి రాబోతోందని, దాన్ని తానే సాధించుకుని తీసుకొస్తానన్నారు. నెల్లూరులో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేనివారు తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.