నన్నెవరూ తరిమేయలేదు.. అన్నకోసం అక్కడికి వెళ్తున్నా
100 కోట్లు ఉన్నవారికి సీఎం జగన్ నెల్లూరు సిటీ సీటు ఇవ్వలేదని, ఓ సామాన్య మైనార్టీ నాయకుడికి సీటు ఇచ్చారని.. అలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అనిల్.
వైసీపీ కొత్త లిస్ట్ లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించిన సీఎం జగన్, ఆ స్థానాన్ని మైనార్టీ అభ్యర్థి ఖలీల్ కు కేటాయించారు. అయితే ఈ నిర్ణయంతో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనారని, ఆయన నేతలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలొచ్చాయి. ఈ క్రమంలో నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ కి పూర్తి స్థాయిలో జిల్లా నాయకుల మద్దతు లభించలేదు. నెల్లూరు సిటీకి సంబంధించి చాలామంది నాయకులు ఆయనకు దూరంగా ఉన్నారు. వారంతా సీఎం జగన్ నిర్ణయాన్ని గౌరవించాలని, ఖలీల్ కి అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే అనిల్.
వీడ్కోలు సమావేశం..
స్థానాలు మారిన అభ్యర్థులంతా సొంత నియోజకవర్గాల్లో వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కూడా ఈరోజు స్థానిక నాయకులు, కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. తననెవరూ నెల్లూరు నుంచి తరిమేయలేదని, జగనన్న పిలుపు మేరకే తాను నర్సరావుపేట లోక్ సభ అభ్యర్థిగా వెళ్తున్నానని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఖలీల్ ఎంపిక గురించి కూడా ఆయన నాయకులకు వివరించారు. ఖలీల్ ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదని, తమకు చెప్పలేదని కొందరు అనుకుంటున్నారని.. అలాంటి అపోహలను పక్కనపెట్టాలని చెప్పారు. అందరూ ఖలీల్ గెలుపుకోసం కృషి చేయాలన్నారు.
100కోట్లు ఉన్నవారికి కాదు..
100 కోట్లు ఉన్నవారికి సీఎం జగన్ నెల్లూరు సిటీ సీటు ఇవ్వలేదని, ఓ సామాన్య మైనార్టీ నాయకుడికి సీటు ఇచ్చారని.. అలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అనిల్. నెల్లూరు సిటీ తనకు ఆత్మ అని.. అలాంటి నియోజకవర్గాన్ని తాను వదిలిపెట్టేది లేదని చెప్పారు. అనిల్ ని మరో జిల్లాకు పంపించారంటే.. సీఎం జగన్ తనను రాజకీయంగా పెంచుతున్నట్టు లెక్క అన్నారు. అభ్యర్థి మారినంత మాత్రాన నెల్లూరు సిటీలో గెలిచేస్తామంటూ కొందరు విర్రవీగుతున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు అనిల్.