మైనార్టీలను వంచించేందుకు మరోసారి సిద్ధమైన చంద్రబాబు
జగన్ హయాంలో మైనార్టీలకు జరిగిన మేలు, చంద్రబాబు హయాంలో జరిగిన మోసం.. రెండూ పోల్చి చూస్తే ఏపీలో ఒక్క మైనార్టీ ఓటు కూడా కూటమికి పడే అవకాశం లేదు.
చంద్రబాబు మోసగాడే.. కానీ తెలివైన మోసగాడు..
నయవంచకుడే.. కానీ నమ్మించి గొంతుకోసే టాలెంట్ ఉన్నోడు..
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే.. కానీ ఆ అబద్ధాలతోనే జనాల్ని బుట్టలో పడేస్తాడు
ఎన్నికల వేళ మరోసారి ఈ టాలెంట్ అంతా బయటకు తీస్తున్నారు చంద్రబాబు. మైనార్టీ డిక్లరేషన్ అంటూ మరో అందమైన కట్టుకథ చెప్పబోతున్నారు. అసలు ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుకి మైనార్టీలు ఎందుకు ఓటు వేయాలి..? బీజేపీతో అంటకాగుతున్న బాబుని ముస్లిం సోదరులు ఎలా నమ్మాలి..? కానీ నమ్మించే ప్రయత్నం చేయబోతున్నారు చంద్రబాబు. గతంలో పదే పదే ఆయన చేతిలో మోసపోయిన ప్రజలు ఈసారి మాత్రం ఆ తప్పు చేసే అవకాశం లేదు. జగన్ హయాంలో మైనార్టీలకు జరిగిన మేలు, చంద్రబాబు హయాంలో జరిగిన మోసం.. రెండూ పోల్చి చూస్తే ఒక్క మైనార్టీ ఓటు కూడా కూటమికి పడే అవకాశం లేదు.
జగన్ చేసిన మంచి - బాబు చేసిన ద్రోహం..
టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేసింది.
జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో మైనార్టీలకు రూ.24,304 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. డీబీటీ పద్ధతిలో రూ.13,239 కోట్లు జమ చేయగా, నాన్ డీబీటీ విధానంలో రూ.11,065 కోట్లు మైనార్టీలకు అందేలా చేశారు జగన్.
మౌజమ్‌లకు బాబు హయాంలో వేతనం రూ.3 వేలు. జగన్ ప్రభుత్వంలో వేతనం రూ.5 వేలు.
ఇమామ్‌లకు బాబు హయాంలో రూ. రూ.5 వేలు చెల్లించేవారు. జగన్ పాలనలో రెట్టంపు.. అంటే రూ.10 వేలు ఇచ్చారు.
వైఎస్ఆర్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, వారికి ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కూడా ప్రవేశ పెట్టడంతో వేలాది మంది ఉన్నత చదువులు చదువుకున్నారు. ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. సామాజికంగా కూడా మైనార్టీల అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారు. ఆ కృషిని నేడు జగన్ కొనసాగిస్తున్నారు.
రాజకీయంగా చంద్రబాబు మైనార్టీలను ఓట్లకోసం వాడుకుంటే.. జగన్ పదవులిచ్చి గౌరవించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికలలో ముస్లింలకు 5 సీట్లు ఇచ్చారు జగన్. గెలిచిన తర్వాత 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా మైనార్టీలకే ఇచ్చి గౌరవించారు జగన్. ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీకి అవకాశమిచ్చారు. జగన్ హయాంలో మొత్తం నలుగురు మైనార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరో నలుగురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. 12 కార్పొరేషన్‌లకు వారే చైర్మన్లు, ఒకరికి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితోపాటు, RTI చీఫ్ కమీషనర్ పదవి కూడా మైనార్టీ వర్గానికే కేటాయించారు జగన్.
ఇక ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే వైసీపీ తరపున ఏడుగురు మైనార్టీలు అసెంబ్లీ బరిలో ఉండగా.. కూటమి తరపున కేవలం ముగ్గురికే ఆ అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీన్ని బట్టి మైనార్టీలు ఏ గట్టున ఉండాలో సులభంగా నిర్ణయించుకోవచ్చు.
ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత టీడీపీకి మైనార్టీలు దూరమవుతారనే విషయం స్పష్టమైంది. కానీ చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మైనార్టీలకు తానే పెద్ద దిక్కు అనే విధంగా ప్రచారంలో ఊదరగొడుతున్నారు. గుంటూరు మీటింగ్ లో ప్లకార్డులు పట్టుకున్నారనే నెపంతో తన ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టించిన ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు అధికారంకోసం వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మైనార్టీ డిక్లరేషన్ అంట కొత్త ఎత్తుగడ వేశారు. ఎన్డీఏతో అంటకాగుతున్న బాబుకి మైనార్టీలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. నిన్ను నమ్మం బాబు అనేస్తున్నారు.