ఆత్మగౌరవ భక్షకుడు చంద్రబాబు.. - మంత్రి చెల్లుబోయిన
అధికారంలో ఉండగా ఇంటికో బెల్ట్ షాప్ పెట్టించిన ఘనుడు చంద్రబాబని, ఇప్పుడు సిగ్గు లేకుండా మద్యం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెడితే.. చంద్రబాబు మాత్రం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. 2014లో బీజేపీతో కలిసి.. ఆ తర్వాత విభేదించిన చంద్రబాబు.. మరోసారి బీజేపీతో చీకట్లో పొత్తు పెంటుకున్నాడని మండిపడ్డారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు చేష్టలకు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని చెప్పారు. ఆనాడు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో పేదల ఆత్మగౌరవం మీద దెబ్బతీశాడని గుర్తుచేశారు.
గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండగా ఇంటికో బెల్ట్ షాప్ పెట్టించిన ఘనుడు చంద్రబాబని, ఇప్పుడు సిగ్గు లేకుండా మద్యం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్‌ను పదవిలో నుంచి దించేసిన బాబు రాజకీయ వ్యాపారం మొదలుపెట్టాడని మండిపడ్డారు. బాబుకు మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఛానల్స్ తోడయ్యాయన్నారు.
రాష్ట్రంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నాడని మంత్రి మండిపడ్డారు. పేదవాడిని పేదవాడిగా మిగిల్చేందుకే టీడీపీ పొత్తులు పెట్టుకుంటోందని ఆయన చెప్పారు. చంద్రబాబుకి అధికారం సంపద సృష్టించటానికి కాదని, తన సొంత సంపాదన కోసమని విమర్శించారు. చంద్రబాబులా ఆచరణ సాధ్యం కానీ హామీలు సీఎం జగన్ ఇవ్వరని, చేయగలిగితేనే మాట ఇస్తారని స్పష్టం చేశారు.