వైసీపీ కొట్లాట: బోసు వ్యాఖ్యలపై వేణు రియాక్షన్
ఇటీవల రెండుసార్లు ఎంపీ పిల్లి సుభాష్ వర్గం నేతలు రామచంద్రాపురం నియోజకవర్గంలో బలప్రదర్శన నిర్వహించారు. బదులుగా ఈరోజు మంత్రి వేణు వర్గం కూడా బలప్రదర్శన చేపట్టింది.
రామచంద్రాపురం కేంద్రంగా వైసీపీ అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ వైసీపీ టికెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై మంత్రి చెల్లుబోయిన సున్నితంగా రియాక్ట్ అయ్యారు. ఆయన తన గురుతుల్యులని, ఆయనతో తనకెలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఫైనల్ గా తాను సీఎం జగన్ మాట మేరకు నడుచుకుంటానన్నారు.
బలప్రదర్శన..
ఇటీవల రెండుసార్లు ఎంపీ పిల్లి సుభాష్ వర్గం నేతలు రామచంద్రాపురం నియోజకవర్గంలో బలప్రదర్శన నిర్వహించారు. బదులుగా ఈరోజు మంత్రి వేణు వర్గం కూడా బలప్రదర్శన చేపట్టింది. తన వర్గం వారందర్నీ ఒకేచోట చేర్చారు వేణు. అయితే తాను మంత్రి అయి మూడేళ్లవుతున్న సందర్భంగా సంతోషంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇదని అన్నారాయన. అంతకు మించి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. ఆయన కవర్ చేసుకున్నా.. అది బలప్రదర్శనేనని తెలుస్తోంది. ఎంపీ పిల్లి సుభాష్ వర్గాన్ని పక్కనపెట్టి, వైసీపీలో తనకు అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే ఓ చోటకు చేర్చారు మంత్రి. తనకు కూడా నియోజకవర్గంపై పట్టుందని నిరూపించుకున్నారు.
జగన్ ఎవరివైపు..?
ప్రస్తుతానికి జగన్ ఆశీస్సులు మంత్రికే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన అనుమతితోనే మంత్రిని రామచంద్రాపురం అసెంబ్లీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించారు. అది నచ్చని ఎంపీ పిల్లిసుభాష్.. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి పంచాయితీతో కూడా ఆయన శాంతించలేదు. పైగా క్యారెక్టర్ లేని వ్యక్తితో తాను చర్చలకు కూర్చునేది లేదని సీఎం జగన్ తోనే డైరెక్ట్ గా చెప్పేశారు. ఇలాంటి ధిక్కార స్వరాలను జగన్ అస్సలు సహించరు. అంటే పిల్లి సుభాష్ వైసీపీకి దూరమవుతున్నట్టే చెప్పుకోవాలి. ఆ సంకేతాలు అందిన తర్వాతే ఆయన పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చారు. మంత్రి వేణుగోపాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.