అవి రెండు కలుపు మొక్కలు.. బావ మనోభావాలు దెబ్బతిన్నట్టే..?
ఆనం, కోటంరెడ్డి నెల్లూరు వైసీపీలో కలుపు మొక్కలని, వాటిని ఏరిపారేశామని చెప్పారు కాకాణి. కోటంరెడ్డి వెళ్లిపోతే దరిద్రం పోయిందని అనుకుంటున్నామన్నారు.
“బావా కాకాణీ, ముందు నీ సీబీఐ కేసు సంగతి చూస్కో..” అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ రెట్టించి అడిగారు. దీంతో బావ కాకాణి మనోభావాలు దెబ్బతిన్నాయి. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన కోటంరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి నమ్మకద్రోహి, విశ్వాస ఘాతకుడు అని అన్నారు. తాను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోటంరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చాలా ఒత్తిడులు వచ్చాయని, కానీ జగన్ ఒక్కడే ఆయనవైపు ఉన్నారని, అందుకే వైసీపీ టికెట్ ఇచ్చారని, వైసీపీ టికెట్ ఇవ్వడం వల్లే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఇప్పుడు వైసీపీని వీడి వెళ్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
నా సవాల్ స్వీకరించు.
తనకు మంత్రి పదవి వచ్చే విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం చేశారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా మంత్రి కాకాణి స్పందించారు. ఆరో తేదీ నెల్లూరుకి వస్తున్నానని, ఎక్కడ ఏ గుడిలో ప్రమాణం చేయమన్నా చేస్తానన్నారు. తన వల్ల సజ్జలకు కానీ, ఆయన వల్ల తనకు కానీ ఏరకమైన లబ్ధి చేకూరలేదన్నారు. నిందలు వేయడం, బురదచల్లి వెళ్లిపోవడం కోటంరెడ్డి ఆనవాయితీ అని, ఆ విషయం నెల్లూరులో దారినపోయే పిల్లవాడిని అడిగినా చెబుతారన్నారు మంత్రి కాకాణి.
కలుపు మొక్కలు..
ఆనం, కోటంరెడ్డి నెల్లూరు వైసీపీలో కలుపు మొక్కలని, వాటిని ఏరిపారేశామని చెప్పారు కాకాణి. కోటంరెడ్డి వెళ్లిపోతే దరిద్రం పోయిందని అనుకుంటున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ గురించి సాక్ష్యం ఉందంటున్న కోటంరెడ్డి, దాన్ని ఎవరికి ఇవ్వాలో వారికే అందించొచ్చు కదా అని ప్రశ్నించారు. కోటంరెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు. ఆయనకు నీతి, నిజాయితీ లేదని, ఉంటే జగన్ ని విడిచిపెట్టేవారు కాదన్నారు. జగన్ బీఫామ్ ఇస్తే గెలిచారని, పార్టీని వీడి వెళ్లిపోతున్నవారు మరోసారి గెలవలేరన్నారు. టికెట్లు రావనుకున్నవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు.
నెల్లూరు నగర మేయర్ స్రవంతి పార్టీని వీడుతున్నంత మాత్రాన ఏమీ కాదని, గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా కూడా జగన్ బాధపడలేదని గుర్తు చేశారు మంత్రి కాకాణి. కార్పొరేటర్లపై కోటంరెడ్డి దాడి చేయడానికి వెళ్లడం సిగ్గు చేటన్నారు. కేసులు పెట్టే విషయంలో మొహమాటాలేవీ లేవని, ఆయన అంత మగాడా, మొనగాడా అని ప్రశ్నించారు కాకాణి. కోటంరెడ్డిని పోలీసులు వదిలిపెట్టరన్నారు.