ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే..
పలాస నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించేందుకు అంతా కలిసి కట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా కేడర్‌కు మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. 2024 సంవత్సరం ఫిబ్రవరిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన నెల రోజులకే ఎన్నికలు ఉంటాయని కూడా ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, బూత్ కన్వీనర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పలాస నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించేందుకు అంతా కలిసి కట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా కేడర్‌కు మంత్రి సూచించారు. 2024 లో ఎన్నికలు అంటే.. అంతా చాలా సమయం ఉందన్న ధీమాలో ఉన్నారని, కానీ సమయం కేవలం ఆరు నెలలు మాత్రమే ఉందనేది అంతా గుర్తుపెట్టుకోవాలని మంత్రి తెలిపారు. కేడర్ అంతా నేటి నుంచే మిషన్ మోడ్ లో పని చేయాలని ఆయన చెప్పారు. పార్టీకి అనుకూలంగా ఉండి.. ఓటు హక్కుకు అర్హత ఉన్న యువతీయువకులను గుర్తించి వారిని ఓటర్లుగా చేర్పించేందుకు కేడర్ కృషిచేయాలని ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు సూచించారు.