కందుకూరు తొక్కిసలాట ప్రమాదం కాదా..? కుట్రా..?
కందుకూరు ఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో జరిగింది ప్రమాదం కాదు అని, దాని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు పర్యటనలో తొక్కిసలాట జరిగి 8 మంది మృత్యువాత పడ్డారు. దీనిపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రచార యావతో చంద్రబాబు జనాన్ని తరలించడం,ఇలా ఇరుకు ప్రదేశాలలో సభలు పెడుతుండటం వల్లే తొక్కిసలాట జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. సభలకు సకాలంలో అనుమతి ఇవ్వకపోవడం, పోలీసులు భద్రతాచర్యలు తీసుకోకపోవడం వల్లే కందుకూరు విషాదం జరిగిందని టీడీపీ అంటోంది.
కందుకూరు ఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో జరిగింది ప్రమాదం కాదు అని, దాని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు కోసం జనం ఎగబడుతున్నారని నేషనల్ మీడియాలో హైప్ చేసుకోవడం కోసమే ఈ కుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేశారు. పథకం ప్రకారం తొక్కిసలాట జరిపించి 8 మందిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొక్కిసలాట ఘటనలో చంద్రబాబును విచారించాలని మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు విపరీత ప్రచారం కల్పించేందుకే టీడీపీ ఈ పనిచేసిందని, అప్పుడు పుష్కరాలు.. ఇప్పుడు కందుకూరు సభ టీడీపీ కుట్రేనని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు.