ఏపీలో షర్మిల ఎంట్రీపై రోజా స్పందన ఇదే..
పార్టీ అధినేత జగన్ తనకు సీటు ఇవ్వకపోయినా మనస్ఫూర్తిగా అంగీకరించి, పార్టీ అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ముందుకెళతానని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రోజా స్పందించారు. తనదైన శైలిలో ఆమె సమాధానమిచ్చారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, ఎవరైనా మేనిఫెస్టో రూపొందించుకొని ప్రకటించుకోవచ్చని చెప్పారు. ఎవరైనా, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని తెలిపారు. మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజల ముందుకు రావొచ్చని ఆమె తెలిపారు. షర్మిల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని రోజా స్పష్టంచేశారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనే క్యారెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డిది కాదని మంత్రి రోజా చెప్పారు.
ఇక తనకు నగరి టిక్కెట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమని రోజా చెప్పారు. ఆయన తనకు సీటు ఇవ్వకపోయినా మనస్ఫూర్తిగా అంగీకరించి, పార్టీ అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ముందుకెళతానని వివరించారు. జగనన్న మాట శిరసావహిస్తానని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌తో జత కలిసినా కూడా ఇంకా తమ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. 2024లో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్రం సంగతి దేవుడెరుగు 2024 ఎన్నికల్లో.. కనీసం తన కుప్పం నియోజకవర్గాన్ని అయినా కాపాడుకోకపోతే తలెత్తుకోలేనని ఆందోళనతో ఉన్నారని తెలిపారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కుప్పం అభివృద్ధికి ఏం చేశారనేది ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.