మంత్రి రోజాకు అవమానం, ఘోర అవమానం..
తనపై విమర్శలు చేసిన జనసేన పార్టీ నేతల్ని అరెస్ట్ చేయించగలుగుతున్నారు కానీ, సొంత పార్టీలోనే ఉంటూ చాపకిందకు నీళ్లు తెస్తున్నవారిని మాత్రం రోజా అడ్డుకోలేకపోవడం నిజంగా విశేషం.
నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రోజా, పైగా ఆమె ఏపీ మంత్రి కూడా. అలాంటి మంత్రి ఓ సచివాలయ భవనాన్ని ప్రారంభించడానికి వస్తున్నారంటే ఏ రేంజ్‌లో హంగామా ఉండాలి. స్వాగత సత్కారాలు, పూల జల్లులు, పూలమాలలు, శాలువాలు, బ్యాండ్ మేళాలు.. ఇలా రకరకాల హడావిడి ఇటీవల చాలా చోట్ల సచివాలయాల ప్రారంభోత్సవాల్లో చూశాం. కానీ మంత్రి రోజా వస్తున్నారనే సరికి ప్రారంభోత్సవానికి సిద్ధమైన సచివాలయానికి తాళం పడింది. సచివాలయానికి కావాలనే తాళం వేసి రోజాని అవమానించారా..? లేక నిజంగానే అక్కడ సమస్య ఉందా..? పోనీ సమస్య ఉంటే అది రోజా ప్రారంభోత్సవం రోజే గుర్తు రావాలా..?
నగరి నియోజకవర్గం వడమాల పేట మండలం పత్తిపుత్తూరులో గ్రామ సచివాలయాన్ని రోజా ప్రారంభించాల్సి ఉంది. ఈ సచివాలయ నిర్మాణ కాంట్రాక్టర్ వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. పాతిక లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఆయన బిల్లులు రాలేదంటూ తాళం వేశారు. తాను ప్రారంభోత్సవానికి వస్తున్నానని తెలిసి కూడా తాళం వేసే సరికి రోజా షాకయ్యారు. కనీసం రోజా కార్యక్రమం ఫిక్స్ కాకముందు కూడా దీనిపై ఆమెకు సమాచారం ఇవ్వలేదు. అంతా బాగానే ఉంది, ఇక రిబ్బన్ కటింగే అనుకున్నారామె. వెంటనే ఇలా జరిగే సరికి ప్రత్యర్థి వర్గం కుట్రగా ఆమె భావిస్తున్నారు.
పదే పదే అవమానాలు..
స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విషయంలో రోజా మాట నెగ్గలేదు. కనీసం నగరి ఎంపీపీ విషయంలో కూడా ఆమె వ్యతిరేక వర్గం పైచేయి సాధించింది. దీంతో రోజా బాగా నొచ్చుకున్నారు. ఆ తర్వాత ఇటీవల నగరి నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు స్థానిక ఎమ్మెల్యేగా ఆమెకు సమాచారం ఇవ్వకుండానే పూర్తి చేసేసింది వైరి వర్గం. దీంతో ఆమె మరింత హర్ట్ అయ్యారు. పంచాయితీ సీఎం జగన్ దగ్గర పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి వర్గం తనను ఇబ్బందులు పెడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేనున్నానంటూ జగన్ భరోసా ఇచ్చి పంపించినా నగరిలో సీన్ మారలేదు. మంత్రి రోజాకు పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి. పొరుగు నియోజకవర్గాలకు వెళ్తే మంత్రి హోదాలో రోజాకు ఘన స్వాగతం పలుకుతుంటారు అందరూ. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడంలేదు. తనపై విమర్శలు చేసిన జనసేన పార్టీ నేతల్ని అరెస్ట్ చేయించగలుగుతున్నారు కానీ, సొంతపార్టీలోనే ఉంటూ చాపకిందకు నీళ్లు తెస్తున్నవారిని మాత్రం రోజా అడ్డుకోలేకపోవడం నిజంగా విశేషం. అయితే రోజా మళ్లీ ఫిర్యాదు చేయడం కోసం జగన్ దగ్గరకు వెళ్తారా లేక మౌనంగా భరిస్తారా అనేది వేచి చూడాలి.