కోర్టు ఆదేశాలతో జైలుకెళితే.. నిరసనలు చేస్తారా..?
చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని రోజా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇదెక్కడి విడ్డూరమని నిలదీశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానం ఆదేశాలతో జైలుకెళితే.. అందుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తారా అంటూ మంత్రి రోజా నిలదీశారు. అంటే మీరు కోర్టుల కంటే గొప్పోళ్లా ..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..? మీరు చేపట్టే నిరసనలు కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతాయన్న జ్ఞానం లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు కంచాలు, గరిటెలతో మోత మోగిద్దామంటూ నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పిలుపునివ్వడంపై మంత్రి రోజా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు.
చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని రోజా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇదెక్కడి విడ్డూరమని నిలదీశారు. నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు.. కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారని వివరించారు. అలాగే.. నిరసనలు కూడా కాపీ కొడుతున్నారని ఈ సందర్భంగా రోజా ఎద్దేవా చేశారు. మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త.. ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పళ్ళాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫ్యామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? అంటూ సెటైర్లు వేశారు.