ఊగిపోతూ, జారిపోతూ, మరచిపోతూ.. ఆ ముగ్గురిపై రోజా సెటైర్లు
టీడీపీని నమ్మితే విద్యార్థులు జైలుకెళ్తారని, పవన్ ని నమ్మితే సినిమాలకెళ్తారని, జగన్ ని నమ్మితే మంచి మంచి కాలేజీలు, యూనివర్శిటీలకు వెళ్తారని అన్నారు మంత్రి రోజా. జగన్ ని ఓడించాలంటే ఆ పక్క కూడా జగనన్నే ఉండాలన్నారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై సహజంగానే విమర్శలతో విరుచుకుపడిపోతుంటారు మంత్రి రోజా. అందులోనూ అది నగరిలో జరిగిన సభ. సీఎం జగన్ ఎదురుగా ఉన్నారు. ఇంకేముంది, రోజా మరింత ఉత్సాహంతో విజృంభించారు. ఆ ముగ్గురిపై తిట్ల దండకం అందుకున్నారు. ఒకరు ఊగిపోతూ, ఇంకొకరు జారిపోతూ, మరొకరు మరచిపోతూ మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు.
టీడీపీని నమ్మితే విద్యార్థులు జైలుకెళ్తారని, పవన్ ని నమ్మితే సినిమాలకెళ్తారని, జగన్ ని నమ్మితే మంచి మంచి కాలేజీలు, యూనివర్శిటీలకు వెళ్తారని అన్నారు మంత్రి రోజా. సీఎం జగన్ ని కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అలాంటి మాటలు వింటే తనకు కోపం పీక్స్ కి వెళ్తుందని, మీకు కూడా కోపం వస్తుంది కదా అని సభకు వచ్చినవారిని ప్రశ్నించారు. జగన్ ని ఓడిస్తామని, ఆడిస్తామని అంటున్నారని.. జగన్ ని ఓడించాలన్నా, ఆడించాలన్నా, జగనన్నలా పాలించాలన్నా దానికింకా ఎవరూ పుట్టలేదన్నారు రోజా. జగన్ ని ఓడించాలంటే ఆ పక్క కూడా జగనన్నే ఉండాలన్నారు. టైంపాస్ రాజకీయాలు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీ రాజకీయాలు చేసేవాళ్లకు అది సాధ్యం కాదన్నారు.
రజినీకాంత్ డైలాగ్..
ఇటీవల జైలర్ సినిమా కోసం రజినీకాంత్ చెప్పిన డైలాగుని సభలో మరోసారి గుర్తు చేశారు రోజా. తమిళంలో కూడా ఆ డైలాగ్ చెప్పి అక్కడకు వచ్చినవారిని అలరించారు. పవన్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా '2024 - జగనన్న వన్స్ మోర్' అని ప్రజలు అంటున్నారని, అదే జరుగుతుందని చెప్పారు రోజా.
అన్నా మీకో విన్నపం..
నగరి సభ నుంచి మీకో విన్నపం అన్నా అని ప్రసంగించిన రోజా.. పవన్, చంద్రబాబుకి విద్యాదీవెన ఇవ్వాలని సీఎం జగన్ ని కోరారు. ఇంటర్లో ఏం చదివారో చెప్పలేని పవన్, ఇంజినీరింగ్ చదవాలంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలని చెప్పే చంద్రబాబుకి విద్యా దీవెన కావాలని చెప్పారు. ఏపీలో వారికి ఇల్లు లేకపోయినా, ఓటు లేకపోయినా, ఏపీ అడ్రస్ తో ఆధార్ కార్డ్ లేకపోయినా.. ప్రత్యేక పవర్ ని ఉపయోగించి విద్యాదీవెనతో వారికి చదువు చెప్పించాలన్నారు. నగరి సభలో ఆ ముగ్గురిపై విమర్శలతో విరుచుకుపడ్డారు రోజా.